పవన్ కళ్యాణ్ హఠాత్తుగా హస్తినకు పయనం  అయ్యారు. ఆయన విజయవాడ నుంచి నేరుగా గన్నవరం  నుంచి విమానం ఎక్కేశారు. దీనికి సంబంధించి ముందూ వెనక ఎలాంటి  ప్రచారమూ లేకుండానే పవన్ ఢిల్లీ యాత్ర సాగడం విశేషం. పవన్ ఎందుకు ఢిల్లీ వెళ్తున్నారు అన్న దాని మీద ఆసక్తికరమైన అంశాలు అనేకం ప్రచారంలోకి వస్తున్నాయి. పవన్ హడావుడి లేని ఢిల్లీ టూర్ ఇపుడు ఏపీ రాజకీయాల్లో వేడిని రాజేస్తోంది.


పవన్ ఢిల్లీ వెళ్ళి అక్కడ బీజేపీ  పెద్దలను కలుస్తారని అంటున్నారు. పవన్ బీజేపీ హై కమాండ్ ని కలుస్తానని చాలాకాలంగా చెబుతూ వస్తున్నారు. విశాఖ లాంగ్ మార్చ్ లో అయితే ఆయన తొందరలో తాను ఢిల్లీ వెళ్తున్నట్లుగా చెప్పారు కూడా. కానీ టైం డేట్ ఎక్కడా వెల్లడి కాకుండానే పవన్ ఢిల్లీ టూర్ కి వెళ్ళడం అంటే ఏదో ఆకస్మికమైన పరిణామమే అంటున్నారు. నిజానికి ఏపీ మీద బీజేపీకి కన్ను ఉంది. ఏపీలో పార్టీని బాగా బలోపేతం చేయాలని ఆలోచిస్తోంది. అందులో భాగంగా పెద్ద సంఖ్యలో పార్టీ నేతలను, ఎమ్మెల్యేలను  టీడీపీ నుంచి చేర్చుకోవాలనుకుంటోంది. ఈ క్రమంలో  పవన్ని కూడా బీజేపీ నేతలు దువ్వుతున్నారని అంటున్నారు. సినీ నటుడిగా, కాపు నాయకుడిగా పవన్ కి గ్లామర్ ఉందని బీజేపీ ఆలోచిస్తోంది.


పవన్ సొంతంగా గెలవకపోయినా ఆయన ఒక ఫోర్స్ అని బీజేపీ నమ్ముతోంది. దాంతో పవన్ని చేరదీయాలన్న ఆలోచనతోనే బీజేపీ పెద్దలు పిలిపించారని అంటున్నారు. పవన్ సైతం బీజేపీ పట్ల ఇపుడు సానుకూలంగా ఉంటున్నట్లుగా ఆయన మాటల బట్టి తెలుస్తోంది. బీజేపీ పెద్దలు తాను బాగా గౌరవించారని, తాను అనవసరంగా విభేదించానని పవన్ బాధపడుతున్నారని భోగట్టా. ఈ మధ్యనే పవన్ మీడియాతో మాట్లాడుతూ మోడీ, అమిత్ షా దేశంలోనే అత్యంత శక్తివంతులు అని కీర్తించారు. మరి పవన్ గతంలో ఇదే మోడీ, షాలను గట్టిగానే విమర్శించారు.

సరే గతం ఎలా ఉన్నా ఇపుడు పవన్ సరైన ట్రాక్ లోకి వచ్చాడని అంటున్నారు. ఇదిలా ఉండగా పవన్ తన ఢిల్లీ పర్యటనలో భాగంగా అమిత్ షాని, మోడీని కలుస్తారని అంటున్నారు. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ మీద పవన్ ఫిర్యాదులు కూడా చేస్తారని చెబుతున్నారు. ఇసుక కొరత, ఇంగ్లీష్ భాష రుద్దుడుతో పాటు, ఏపీలో పెరిగిన మత ప్రచారం కూడా పవన్ ఫిర్యాదుల్లో ఉండబోతున్నాయట. మరి చూడాలి పవన్ ఢిల్లీ టూర్ ఏ రకమైన ప్రకంపనలు స్రుష్టిస్తుందో.



మరింత సమాచారం తెలుసుకోండి: