ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.  ఇన్నాళ్లూ.. ఒక కుటుంబానికి రేషన్‌ కార్డు ఆధారంగా.. వివిధ పథకాల ఫలాలు అందుతూ వచ్చేవి. కానీ.. ఇప్పుడు అందులో కూడా జగన్ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. వినూత్నంగా.. రేషన్‌ కార్డు స్థానంలో మరో నాలుగు కొత్త కార్డులను ప్రవేశపెట్టింది. బియ్యం కార్డు, పింఛన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, ఫీజు రియంబర్స్ కార్డుల‌ను వేర్వేరుగా అందించ‌నుంది.  ఈ నేప‌థ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తాజాగా వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించి...వీటి గురించి తెలియ‌జేశారు.


పలు ప్రభుత్వ పథకాలకు అర్హులను సంతృప్తికర స్థాయిలో గుర్తించేందుకు ఈ నెల 20 నుండి డిసెంబరు 20 వరకూ వై.ఎస్.ఆర్.నవ‌శకం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక  డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తెలిపారు.ఈ డ్రైవ్‌లో రైస్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన కార్డుల జారీకి అర్హులను గుర్తించాల్సి ఉందన్నారు. ఈ డ్రైవ్‌ను నిర్ణీత సమయంలో పూర్తిచేసేందుకు షెడ్యూలును ఖరారు చేయడం జరిగిందన్నారు.  సదరు షెడ్యూలు ప్రకారం వై.ఎస్.ఆర్.నకశకం ప్రత్యేక డ్రైవ్ విజయవంతంగా నిర్వహించి ప్రభుత్వ పధకాలకు నిజమైన అర్హులను అందరినీ సంతృప్తికర స్థాయిలో గుర్తించాలని జిల్లా కలెక్టరన్లు ఆమె కోరారు.  


శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్పరెన్సు నిర్వహించి వై.ఎస్.ఆర్.నవ‌శకం ప్రత్యేక డ్రైవ్ గురించి సమగ్రంగా వివరించారు. గ్రామ స్వరాజ్య స్థాపనలో భాగంగా రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు ఉద్యోగులు, వాలంటీర్ల నియామకం ప్రక్రియ పూర్తిచేయడం జరిగిందన్నారు. గ్రామ, వార్డు స్థాయిలో ఉన్నఈ యంత్రాగాన్ని చక్కగా వినియోగించుకుంటూ ప్రజల ఇళ్ల వద్దకే ప్రభుత్వ సేవలను నేరు అందజేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఉందన్నారు. అయితే ప్రభుత్వం అందజేసే ఈ సేవలు  అర్హులు అందరికీ చేరాలంటే, ముందుగా సంతృప్తికర స్థాయిలో అర్హుల గుర్తింపు కార్యక్రమాన్ని నిర్వహించాల్సిన అవసరాన్ని ప్రభుత్వం గుర్తించిదన్నారు.  ఈ నేపధ్యంలో ఈ నేల 20 నుండి డిసెంబరు 20 వరకూ వై.ఎస్.ఆర్.నవ‌శకం ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించేందుకు నిర్ణయించిందన్నారు. అదే విధంగా వైఎస్ఆర్ మత్స్యకార భ‌రోసా, వైఎస్ఆర్ నేతన్న నేస్తం, వైఎస్ఆర్ జీరో వడ్డీ పథకం, వైఎస్ఆర్ కాపు నేస్తం, జగ‌నన్న అమ్మఒడి తదితర పథకాలతో పాటు ఇమామ్స్, ముజామ్స్, పాస్టర్ల‌కు గౌరవ వేతనం, అర్చ‌కులకు జీతాల పెంపు మరియు నాయీ బ్రాహ్మణులకు, రజకులకు, టైలర్లకు ఆర్థిక సహాయం అందజేసే పథకాలకు కూడా లబ్దిదారులను గుర్తించాల్సి ఉందని ఆమె తెలిపారు. ఆయా పథకాలకు లబ్దిదారుల గుర్తింపుకై మార్గదర్శకాలను, ప్రభుత్వ ఉత్తరువులను సంబందిత శాఖలు వెంటనే జారీచేయాలని ఆమె సూచించారు. 


అర్హుల జాబితాకు అనుగుణంగా డిశంబరు 18, 19 తేదీల్లో రైస్ కార్డు, వైఎస్ఆర్ పెన్షన్ కానుక కార్డు, వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కార్డు, జగనన్న విద్యా దీవెన మరియు జగనన్న వసతి దీవెన పథకాలకు కార్డులను ముద్రించాలన్నారు. తదుపరి డిశంబరు 20 నుండి ఆయా కార్డుల జారీ ప్రక్రియను చేపట్టాలని జిల్దా కలెక్టర్లకు ఆమె సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మంగా నిర్వహిస్తున్నఈ ప్రత్యేక డ్రైవ్‌ను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టరను ఆమె కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: