ఒంగోలు: గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. టీడీపీకి రాజీనామా చేసిన వంశీ.. నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌పై తీవ్ర విమర్శలు చేశారు. జయంతికి.. వర్ధంతికి తేడా తెలియని వాళ్లు అంటే పడాలా? అని ఘాటు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్యే వంశీ వ్యాఖ్యలపై మాజీ మంత్రి నారా లోకేష్ అదే స్థాయిలో స్పందించారు.


ఆస్తుల కోసమే వంశీ పార్టీ మారుతున్నారని.. అలాంటి వారు పార్టీ మారినంత మాత్రాన నష్టమేమీ లేదని స్పష్టం చేశారు.గతంలో కార్యకర్తలపై ఒత్తిడితోనే పార్టీ మారుతున్నానని చెప్పిన వంశీ.. వెంటనే జే టర్న్ తీసుకుని తనపై ఆరోపణలు చేసి పార్టీ నుంచి బయటికి వెళ్లాడని లోకేష్ అన్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ది 2009 వ్యవహారం.. ఇప్పుడు 2019లో ఉన్నాం.. ఆయన ఇంకా హ్యాంగోవర్‌లో ఉన్నాడంటూ వంశీపై లోకేష్ సెటైర్లు వేశారు.



వంశీమోహన్ కు సిగ్గుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలంటూ సవాల్ విసిరారు. ఉపఎన్నికల్లో ఓడిపోతాడనే భయం ...పార్టీలోకి చాలా మంది నాయకులు వస్తారు.. పోతారు.. అలాంటి వారి గురించి చర్చించాల్సిన అవసరం లేదని లోకేష్ తేల్చి చెప్పారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తల బలం ఉందని.. నాయకులు వెళ్లినా కార్యకర్తలు మాత్రం పార్టీ వెంటే ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు జగన్‌ని తిట్టిపోసిన వ్యక్తి ఇప్పుడు ఆయన పంచకే చేరారని విమర్శించారు.


సోషల్ మీడియాలో జరిగిన ప్రచారాన్ని తనకు ఆపాదించడం తగదని.. ఎవరో వార్తలు రాస్తే తానెలా బాధ్యుడిని అవుతానంటూ ప్రశ్నించారు. ఆ వెబ్‌సైట్లతో తనకెలాంటి సంబంధం లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఎవరికి భూమి కేసులున్నాయో వాళ్లే పార్టీ వీడి వెళ్తున్నారని లోకేష్ అన్నారు. ఐదు నెలల్లోనే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందని.. ప్రజలు ఇచ్చిన ఒక్క చాన్స్ అయిపోయిందన్నారు. ఇకపై జగన్ గెలిచే అవకాశమే లేదని ఆయన అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: