కర్ణాటక కాంగ్రెస్ సీనియర్‌ నేత డీకే బెయిల్‌ను సవాల్‌ చేస్తూ ఈడీ వేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు రాగా.. ఈడీ తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తంచేసింది. పౌరులను గౌరవించే పద్ధతి ఇది కాదని చివాట్లు పెట్టింది. డీకే బెయిల్ పై మరోసారి పునరాలోచించాలన్న ఈడీ తరఫు న్యాయవాది, సొలిసిటర్ జనరల్‌ తుషార్‌ మెహతా  అభ్యర్థనను జస్టిస్‌ నారీమన్‌ తిరస్కరించారు. 


కర్నాటక కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ బెయిల్ వ్యవహారంపై ఈడీకి సుప్రీం కోర్టు అక్షింతలు వేసింది. డీకే కు బెయిల్ ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ... ఈడీ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ను సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎఫ్ నారీమన్ తీవ్రంగా హెచ్చరించారు. శివకుమార్ బెయిల్‌ను వ్యతిరేకిస్తూ ఈడీ దాఖలు చేసిన అప్పీల్‌ను కొట్టివేసింది సర్వోన్నత న్యాయస్థానం. ఈ పిటిషన్‌లో పేర్కొన్న విషయాలపైనా తీవ్ర విస్మయం వ్యక్తం చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ హోంమంత్రి పి.చిదంబరం బెయిల్‌ను వ్యతిరేకిస్తూ వేసిన పిటిషన్‌లోని విషయాలనే అచ్చుగుద్దినట్టు కాపీ, పేస్ట్ చేయడంపై ఈడీని నిలదీసింది.  


ఈడీ అప్పీల్‌ను సుప్రీం ధర్మాసనం నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడమే కాకుండా.. పౌరులతో వ్యవహరించేది ఇలాగేనా అంటూ తీవ్రంగా మందలించింది. కాపీ-పేస్ట్ ప్రక్రియలో శివ కుమార్‌ను ఏకంగా మాజీ హోంమంత్రి అని సంబోధిస్తూ బండ తప్పులు రాశారని జస్టిస్ నారీమన్ అక్షింతలు వేసారు. తమ పిటిషన్లను కొట్టివేయవద్దనీ.. వాటిని స్వీకరించాలంటూ సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా పదేపదే కోర్టును కోరడంపైనా జస్టిస్ నారీమన్ తీవ్రస్వరంతో స్పందించారు. ఈ కేసును కొట్టివేసి, సెషన్‌ను ముగించిన అనంతరం శబరిమలపై భిన్నాభిప్రాయాలతో కూడిన మా తీర్పును చదవండి. మా తీర్పులతో ఆడుకోవద్దని హెచ్చరించారు. మా తీర్పులు ఎలా ఉంటాయో మీ ప్రభుత్వానికి చెప్పండని తుషార్ మెహాతానుద్దేశించి పదునైన స్వరంతో హెచ్చరించారు. సుప్రీం కోర్టు న్యాయమూర్తి హెచ్చరికతో కాంగ్రెస్ నేతలపై  సీబీఐ, ఈడీల దూకుడుకు ఖచ్చితంగా కళ్లెం పడుతుందని అంతా భావిస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: