ఐఐటీ-చెన్నై విద్యార్థిని ఫాతీమా ఆత్మహత్య కేసు విశ్వరూపం దాల్చింది. చదువుల ఒత్తిడి.. పరీక్షల్లో మార్కులు తక్కువ రావడంతో ఆత్మహత్య చేసుకుందని చెబుతూ ఆదరాబాదరా కేసు మూసేసే ప్రయత్నం పోలీసులు చేశారు. కానీ.. తన చావుకు ముగ్గురు ప్రొఫెసర్లు కారణమంటూ వారి పేర్లు రాసిన నోట్‌, ఆమె సెల్‌ఫోన్‌లో కనిపించడంతో కేసు మలుపు తిరిగింది. కేసుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్ధులు ఆందోళన బాటపట్టారు.   


తమిళనాడులో ఐఐటీ విద్యార్థిని ఫాతిమా ఆత్మహత్య సంచలనం సృష్టిస్తుంది. కేరళలోని కొల్లంకు చెందిన 19ఏళ్ల ఫాతీమా లతీఫ్‌ ఐఐటీ మద్రాస్ లో ఎమ్.ఎ ఫస్టియర్ స్టూడెంట్. ఈ నెల 9న తన హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడంతో తొలుత ఒక సాధారణ సంఘటనగా పరిగణించారు పోలీసులు. కిందటి నెల జరిగిన పరీక్షలో తక్కువ మార్కులు రావడంతో ప్రాణాలు తీసుకుందని కేసు దర్యాప్తు చేస్తున్న చెన్నై కొట్టూరుపురం పోలీసులు తేలిగ్గా తీసుకున్నారు. హడావుడిగా పోస్టుమార్టం పూర్తి చేయించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.  


ఫాతీమా సోదరి ఆయేషా పోలీస్‌స్టేషన్‌కు వచ్చి స్విచ్‌ ఆఫ్‌ చేసి ఉన్న సెల్‌ఫోన్‌ను ఆన్‌ చేసి పరిశీలించగా సుదర్శన్‌ పద్మనాభన్‌ అనే ప్రొఫెసర్‌ వేధింపుల వల్లే ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా ఆమె నమోదు చేసిన ఎస్‌.ఎం.ఎస్‌ బయటపడింది. దీంతో మృతురాలి తండ్రి అబ్దుల్‌ లతీఫ్‌ స్వయంగా కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసుకుని ప్రొఫెసర్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. కేరళ సీఎం తమిళనాడు సీఎంకు ఉత్తరం రాయడంతో రెండు రాష్ట్రాల వ్యవహారంగా మారింది. దీంతో ఐదురోజుల తరువాత ఆత్మహత్య ఘటన విశ్వరూపం దాల్చింది. ఈ మేరకు చెన్నై పోలీసు కమిషనర్‌ రంగంలోకి దిగి విచారణ వేగవంతం చేశారు. ఫాతీమా ఆత్మహత్యపై సవివరమైన నివేదికను ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీస్‌ కమిషనర్‌ను సీఎం ఆదేశించారు.  


తన సూసైడ్‌ నోట్స్‌లో ఆమె పేర్కొన్న సుదర్శన్‌ పద్మనాభన్‌ ఐఐటీ మద్రాసులోని హ్యూమానిటీస్‌ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌. ఇక, మిలింద్‌ బ్రాహ్మే.. ట్రాన్స్‌లేషన్‌ స్టడీస్‌ బోధిస్తున్నారు. అలాగే ఐఐటీ మద్రాసుకు సంబంధించి అంబేడ్కర్‌ పెరియార్‌ స్టడీ సర్కిల్‌ అకాడమిక్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్నారు. కమిషనర్‌ ఏకే విశ్వనాథన్‌ స్వయంగా ఐఐటీకి వెళ్లి ప్రొఫెసర్‌ సుదర్శన్‌ పద్మనాభన్‌, సహ విద్యార్థులను విచారించారు. ఫాతీమా రాసిన ఆత్మహత్య ఉత్తరాన్ని దగ్గర ఉంచుకుని కమిషన్‌ వేసిన ప్రశ్నలకు సుదర్శన్‌ ఇచ్చిన సమాధానాన్ని వాంగ్మూలంగా నమోదు చేశారు. మాజీ సీబీఐ అధికారి ఈశ్వరమూర్తి నేతృత్వంలోని ప్రత్యేక బృందం కేసును విచారిస్తుందని కమిషనర్‌ తెలిపారు. అలాగే ఐదుగురు ప్రొఫెసర్లు బృందంగా ఏర్పడి 15 మంది స్నేహితుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు.  


తమ కుమార్తె ఎంతో ధైర్యవంతురాలనీ ఫాతిమా తండ్రి అబ్దుల్‌ లతీఫ్, తల్లి సుజిత అన్నారు. ఐఐటీ ప్రవేశపరీక్షలో ప్రథమశ్రేణిలో ఉత్తీర్ణురాలైంది. తక్కువ మార్కుల వల్ల ఆత్మహత్యకు పాల్పడిందని చెప్పడం సరికాదన్నారు. కాలేజీలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తమకు పదేపదే ఫోన్‌ చేసి చెప్పేదని తెలిపారు. మానసికంగా వేధించి హతమార్చి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని దుయ్యబట్టారు ఆమె తల్లిదండ్రులు. ఫాతీమా ఆత్మహత్య ఉదంతంతో ఐఐటీ మద్రాస్ విద్యార్థులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆత్మహత్యకు కారణమైన ప్రొఫెసర్‌ను అరెస్ట్‌ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఐఐటీలో తరచూ విద్యార్థుల ఆత్మహత్య సంఘటనలు జరుగుతున్నందున ప్రత్యేక బృందంతో విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. ఐఐటీ మద్రాస్ లో ఏడాది వ్యవధిలో ఐదుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐఐటీ విద్యార్థిని ఫాతిమా మరణంపై హేతుబద్ధమైన విచారణ జరగాలని డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ డిమాండ్‌ చేశారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: