ఐదు నెలల ముందువరకు అధికారంలో హడావిడి చేసిన టీడీపీ నేతలని ఎన్నికల్లో ఘోర ఓటమి దారుణంగా దెబ్బ తీసింది. ఓటమి దెబ్బకు ఎక్కడి నేతలు అక్కడే గప్ చుప్ అయిపోయారు. మరికొందరు నేతలైతే టీడీపీలో ఉండలేమని బీజేపీ, వైసీపీల్లోకి వెళ్ళిపోయారు. అయితే నేతలు సైలెంట్ అయిన...కార్యకర్తలు కొన్ని నియోజకవర్గాల్లో యాక్టివ్ గా ఉంటే, కొన్ని చోట్ల బయటకు కూడా రావడం లేదు. ఈ క్రమంలోనే కృష్ణా జిల్లా బోర్డర్ లో ఉన్న అవనిగడ్డ నియోజకవర్గంలో అసలు టీడీపీ ఉందా? అనే అనుమానాలు వస్తున్నాయి.


ఈ నియోజకవర్గంలో ఉన్న సీనియర్ నేత మండలి బుద్దప్రసాద్ ఓడిపోయాక పెద్దగా బయట కనపడటం లేదు. 2014 ముందు వరకు కాంగ్రెస్ లో ఉన్న బుద్దప్రసాద్ రాష్ట్ర విభజనతో టీడీపీలోకి వచ్చారు. ఇక 2014 ఎన్నికల్లో గెలిచి, డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేశారు. అయితే మొన్న జగన్ గాలిలో బుద్దప్రసాద్ కూడా దారుణంగా ఓడిపోయారు. ఇక ఓటమి పాలైన దగ్గర నుంచి సైలెంట్ అయిపోయిన ఆయన...అప్పుడప్పుడు పార్టీ సమావేశాల్లో మాత్రమే కనిపించారు. కానీ నియోజకవర్గంలో మాత్రం పార్టీ బలోపేతం చేసే కార్యక్రమం ఏది చేయలేదు.


ఓటమి వలనో, వయసు మీద పడటమో గానీ మండలి మాత్రం నియోజకవర్గంలో యాక్టివ్ గా తిరగడం లేదు. ఇక నాయకుడే సైలెంట్ ఉంటే మిగిలిన ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు ఏం చేస్తారు. వారు కూడా మాకెందుకులే అన్నట్లు ఉన్నారు. ఇక బుద్ధ ప్ర‌సాద్ స్పీడ్‌గా యాక్టివ్ అయినా కూడా ఆయ‌న‌కు మాజీ మంత్రి దేవినేని ఉమామ‌హేశ్వ‌ర‌రావుతో ఉన్న వైరం నేప‌థ్యంలో ఆయ‌న అసంతృప్తితో ఉన్నారు.


ఒకవేళ ఏం చేస్తే వైసీపీ ప్రభుత్వం ఏం కేసులు పెడుతుందో అని భయపడుతున్నారు. ఈ పరిస్థితులతో నియోజకవర్గంలో టీడీపీ ఉందా? లేదా? అన్నట్లుగా అయిపోయింది.  మొత్తానికైతే అవనిగడ్డ నియోజకవర్గంలో టీడీపీ అడ్రెస్ గల్లంతైపోయినట్లేనని అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: