రాజీనామా చేసిన గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ గురించి మాట్లాడాలంటేనే టిడిపి నేతలు భయపడిపోతున్నారా ?  పార్టీలో పరిస్ధతి చూస్తుంటే అందరికీ అదే అనుమానం వస్తోంది. ఉండటానికి చాలామందే నేతలున్నా చాలామంది మొహం చాటేస్తున్నారట వంశీ గురించి మాట్లాడమని చెప్పినపుడు. ఇద్దరు నేతలకు ఎదురైన చేదు అనుభవం వల్ల మిగిలిన వారు ముందు జాగ్రత్త పడినట్లు సమాచారం.

 

శుక్రవారం ఉదయం వంశీ గురించి ఓ టివి చానల్ నిర్వహించిన చర్చలో ఎంఎల్సీ రాజేంద్రప్రసాద్ నోటికొచ్చినట్లు కామెంట్ చేశారు. అదే చర్చలో పాల్గొన్న వంశీ ఇక ఎంఎల్సీని ఓ ఆటాడుకున్నారు. ఇద్దరు తిట్టేసుకున్నారు. అయితే వంశీ నోటికొచ్చినట్లు బూతులు అందుకోవటంతో ఎంఎల్సీ తట్టుకోలేకపోయారు. ఆ ఎపిసోడ్ విషయం టిడిపి నేతలందరికీ తెలిసిపోయింది. దాంతో ఎవరికి వారుగా ముందు జాగ్రత్తపడిపోయారు.

 

మధ్యాహ్నం నారా లోకేష్ ఎంఎల్ఏ గురించి మాట్లాడినా వంశీ లేవనెత్తిన ప్రశ్నలకు మాత్రం సమాధానం చెప్పలేకపోయారు. చివరకు ఏడవలేక నవ్వు మొహం పెట్టినట్లుగా నటించి మీడియా సమావేశం ముగించేశారు. ఇక మరో ఎంఎల్సీ బుద్ధా వెంకన్న అయితే ట్విట్టర్ కు మాత్రమే పరిమితమయ్యారు. ట్విట్టర్లో కూడా వంశీ గురించి కాకుండా జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ ఎంపి విజయసాయిరెడ్డినే టార్గెట్ చేశారు.

 

జిల్లాలో ఓ ఎంపి ఉన్నాడు. చాలామంది మాజీ మంత్రులున్నారు. ఎంతోమంది మాజీ ఎంపిలు, మాజీ ఎంఎల్ఏలున్నా ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా చంద్రబాబుకు మద్దతుగా వంశీని ఎండగట్టటానికి మీడియా ముందుకు రాలేదు. ఎందుకు రాలేదంటే వంశీ మాట్లాడిన ప్రతీ మాట వాస్తవమే కాబట్టి.

 

పైగా నిన్నటి వరకు పార్టీలో తమతో బాగా సన్నిహితంగా ఉన్న ఎంఎల్ఏ ఒక్కసారిగా వ్యతిరేకమయ్యేటప్పటికి టిడిపి నేతలెవరు మాట్లాడలేకపోతున్నారు. జిల్లాలోని అందరి జాతకాలు వంశీ దగ్గరున్నాయి. ఐదేళ్ళ పాలనలో ఎవరెంత లబ్దిపొందరు, ఎలా లాభపడ్డారనే ప్రతీ విషయం వంశీ గుప్పిట్లో ఉంది.

 

అందుకనే ఎంఎల్ఏకి వ్యతిరేకంగా మాట్లాడితే తమ గురించి చాకిరేవు పెడతారో అని భయపడిపోతున్నారు. శాంపుల్ గా పెనమలూరు మాజీ ఎంఎల్ఏ బోడె ప్రసాద్ దగ్గర రాజేంద్రప్రసాద్ తీసుకున్న డబ్బు విషయాన్ని ప్రస్తావించారు. అలాగే  చంద్రబాబు దగ్గర తీసుకున్న డబ్బు విషయాన్ని కూడా ప్రస్తావించేటప్పటికి టివి చర్చలో ఎంఎల్సీ నోరు పడిపోయింది.

 

ఈ రెండు ఉదాహరణలు గమనించిన తర్వాత వంశీని కెలుక్కోవటం ఎందుకులే అనుకున్నట్లున్నారు. అందుకనే వంశీకి వ్యతిరేకంగా మాట్లాడాలంటేనే భయపడిపోతున్నట్లున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: