288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఫ‌లితాలు వ‌చ్చి 20 రోజులు అవుతున్నా...ఇంకా స‌ర్కారు కొలువుదీర‌లేదు. అయితే, మహారాష్ట్రలో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడినట్టేనని తెలుస్తోంది. మెజార్టీ సీట్లు గెలిచిన శివసేన, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్‌ పార్టీల మధ్య పొత్తు కుదిరినట్లు స‌మాచారం. ఈ మూడు పార్టీల నాయకులు కలిసి ప్రభుత్వ ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.


మూడు పార్టీలు కలిసి కనీస ఉమ్మడి ప్రణాళికను ఖరారు చేసినట్లు తెలుస్తోంది.  కనీస ఉమ్మడి ప్రణాళిక పేరుతో అవ‌గాహ‌న ఒప్పందం కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. ఐదేళ్ల పాటు శివసేనకే సీఎం పదవి ఇవ్వాలని కనీస ఉమ్మడి ప్రణాళికలో పొందుపర్చినట్లు తెలుస్తోంది.  మంత్రి పదవుల్లో శివసేనకు 14, ఎన్సీపీకి 14, కాంగ్రెస్‌కు 12 మంత్రి స్థానాలు దక్కనున్నాయి. కాంగ్రెస్‌, ఎన్సీపీకి డిప్యూటీ సీఎం పదవులు ఇవ్వనున్నారు. స్పీకర్‌ పోస్టును కాంగ్రెస్‌ను, కౌన్సిల్‌ చైర్మన్‌ పదవికి ఎన్సీపీకి కట్టబెట్టనున్నారు.


ఈ మూడు పార్టీలు కలిసి మహారాష్ట్రలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నయానే వార్త‌లు...ఆయా పార్టీల మ‌ధ్య మాట‌ల యుద్ధానికి ఆజ్యం పోశాయి. ముంబైలో విలేకరులతో మాట్లాడిన  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మహారాష్ట్రలో శివసేన, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ), కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, సంకీర్ణ సర్కార్ పూర్తికాలం అధికారంలో ఉంటుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలు వస్తాయనే వ్యాఖ్యలను నమ్మొద్దని అటువంటి పరిస్థితి వచ్చే అవకాశమే లేదని పవార్ స్పష్టం చేశారు. మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయన్నారు. సంకీర్ణ సర్కార్ ఆరు నెలల కన్నా ఎక్కువ కాలం ఉండదని త్వరలోనే కుప్పకూలుతుందని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై పవార్ మండిపడ్డారు. కొన్నేళ్లుగా దేవేంద్ర జీ నాకు తెలుసు. కానీ ఆయన జ్యోతిష్యశాస్త్ర విద్యార్థి కూడా అని నాకు తెలియదని ఎద్దేవా చేశారు. మళ్లీ తానే ముఖ్యమంత్రి పదవి చేపడతానని ఫడణవీస్ చేసిన వ్యాఖ్యలపై పవార్ తీవ్రంగా విమర్శించారు. 'మధ్యంతర ఎన్నికలు వచ్చే ప్రసక్తే లేదు. ప్రభుత్వాన్ని కచ్చితంగా ఏర్పాటు చేస్తాం. కూటమి పూర్తి కాలం అధికారంలో ఉంటుంది. ఐదేళ్ల‌ పాటు ప్రభుత్వాన్ని నడుపుతామని మేమంతా బలంగా నమ్ముతున్నాం. కూటమిలోని పార్టీలన్నీ కనీస ఉమ్మడి కార్యక్రమం రూపకల్పన కోసం కృషి చేస్తున్నాయి` అని ఆయన వివరించారు.


తాము అధికారంలోకి రాబోతున్నామని శివ‌సేన పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్ ప్ర‌క‌టించారు. శివసేన నేతృత్వంలోని ప్రభుత్వం ఏర్పడుతుందన్నారు. గతంలో శివసేనతో కలిసిన పార్టీలో ఐదేళ్ల పాటు సుస్థిర పాలనను అందించాయని రౌత్‌ గుర్తు చేశారు. మహారాష్ట్రకు ఈ ఐదేళ్లు కాదు.. రాబోయే 25 ఏళ్లు కూడా శివసేన సైనికుడే సీఎంగా ఉంటారని ప్ర‌క‌టించ‌డం గ‌మ‌నార్హం.
కాగా, ఈ ప‌రిణామాల‌పై బీజేపీ ఘాటుగా స్పందించింది. మహారాష్ట్రలో బీజేపీ లేకుండా ప్రభుత్వ ఏర్పాటు ఉండబోదని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ స్పష్టం చేశారు. బీజేపీకే సంఖ్యాబలం అధికంగా ఉందని, 119 మంది ఎమ్మెల్యేలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. మహారాష్ట్రలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కృతనిశ్చయంతో ఉన్నామని, ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: