జాతిపిత మహాత్మాగాంధీ ఆత్మ క్షోభించే సంద‌ర్భం ఇది. గాంధీజీని నాథూరాం గాడ్సే చంపాడని అందరికీ తెలుసు. ఆ తర్వాత గాడ్సేను పట్టుకుని ఉరి కూడా తీశారు. నాథూరాం గాడ్సే జరిపిన కాల్పుల్లో జాతిపిత మహాత్మాగాంధీ ప్రాణాలు కోల్పోయిన విషయం పక్క‌న పెట్టారో...లేదా తెలియ‌క (!?) చేశారో కానీ ఒడిశాలోని ఓ స్కూల్‌లో పంపిణీ చేసిన కరపత్రంలో గాంధీజీ ప్రమాదవశాత్తు చనిపోయారని ముద్రించారు. ఈ ప‌రిణామం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. 


‘అవర్‌ బాపూజీ..ఏ గ్లింప్స్‌’ పేరుతో ప్రచురించిన రెండు పేజీల బుక్‌లెట్‌లో ఇలా గాంధీజీ గురించి దారుణ‌మైన త‌ప్పిదాలు ప్ర‌చురించారు.  రాష్ట్ర స్కూలు, మాస్ ఎడ్యుకేషన్ శాఖ ప్రచురించిన ఈ పుస్తకంలో గాంధీజీ జీవితం, ఒడిశాతో గాంధీజీకున్న అనుబంధం, ఇతర అంశాలను బుక్‌లెట్‌పై పొందుపర్చారు. ఇందులోనే, 1948 జనవరి 30న ఢిల్లీలోని బిర్లా హౌస్‌లో గాంధీజీ ప్రమాదశాత్తు చనిపోయారని బుక్‌లెట్‌పై ముద్రించారు. సాక్షాత్తు స‌ర్కారీ స‌మాచారంలోనే ఇంత ఘోర‌మైన త‌ప్పిదాలు జ‌ర‌గ‌డం ప‌ట్ల క‌ల‌క‌లం రేకెత్తిస్తోంది. 


జాతిపిత మరణానికి సంబంధించి జరిగిన ఈ తప్పిదంపై పలువురు రాజకీయ వేత్తలు, సామాజిక వేత్తల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బుక్‌లెట్లో జరిగిన తప్పిదంపై సీఎం నవీన్‌ పట్నాయక్‌ క్షమాపణలు చెప్పాలని ప‌లువురు డిమాండ్‌ చేశారు. ఈ ప‌రిణామంపై కాంగ్రెస్ తో బాటు పాలక బీజేడీ సభ్యులు కూడా రాష్ట్ర అసెంబ్లీలో తీవ్రంగా మండిపడ్డారు. సీఎం నవీన్ పట్నాయక్ తక్షణమే అపాలజీ చెప్పాలని సీఎల్ఫీ నేత నరసింహ మిశ్రా డిమాండ్ చేశారు. ఆయనను ఈ దేశం క్షమించదన్నారు. ‘ అంటే గాంధీజీని గాడ్సే చంపలేదన్నది ఈ ప్రభుత్వ అభిప్రాయమా అని ప్రశ్నించారు. గాడ్సేని ఉరి తీసిన విషయం ఈ సర్కార్ కి తెలియదా అని కూడా నిలదీశారు. బీజేపీ, బీజేడీ రెండు పార్టీలూ ఒకే నాణేనికి ఉన్న బొరుసుల్లాంటివని ఆయన విమర్శించారు.తప్పుడు సమాచారంతో ముద్రించిన బుక్‌లెట్‌ను తక్షణమే వెనక్కి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి అశిష్‌ కనుంగో డిమాండ్‌ చేశారు.స్కూల్‌ పిల్లలకు వాస్తవాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఆయ‌న పేర్కొన్నారు. కాగా- ఈ వివాదాస్పద అంశాన్ని వెంటనే తొలగించాలని నవీన్ పట్నాయక్ ఆదేశించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: