నిజ‌మండి. హైద‌రాబాద్‌ సెల్ఫీ దిగితే పోలీసులు మిమ్మ‌ల్ని హెచ్చ‌రిస్తారు. అలా చేయ‌వ‌ద్ద‌ని పెద్ద ఎత్తున సౌండ్ల‌తో ప్ర‌చారం చేస్తారు? ఎందుకు...ఎక్క‌డ అంటారా?  హైద‌రాబాద్‌ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్ వ‌ద్ద‌. ఎందుకంటే...ఈ నెల 10న వొడాఫోన్‌ సంస్థలో సేల్స్‌మెన్లుగా పనిచేస్తున్న సాయి వంశీరాజ్‌, ప్రవీణ్‌కుమార్‌ అర్ధరాత్రి సమయంలో బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌పై నిల్చుని సెల్ఫీలు దిగుతున్నారు. ఇదే సమయంలో రాయదుర్గం నుంచి హైటెక్‌సిటీ మార్గంలో కాగ్నిజెంట్‌ ఉద్యోగి అభిలాష్‌ తన కారులో వేగంగా దూసుకువచ్చాడు. మూలు మలుపు వద్ద సెల్ఫీలు దిగుతున్న వారిని గమనించకుండా వారిపై నుంచి దూసుకువెళ్లాడు. అంతే సెల్ఫీలు దిగుతున్న వంశీరాజ్‌, ప్రవీణ్‌కుమార్‌ ఫ్లైఓవర్‌ మీద నుంచి ఎగిరి కిందపడి అక్కడిక్కడే మృతి చెందారు. అంతేకాకుండా ముందున్న వాహనాలను సైతం కారు ఢీ కొట్టడంతో సాయికృష్ణ, పవన్‌కుమార్‌, మురళీకృష్ణ, గిరిధర్‌లు తీవ్రంగా గాయపడ్డారు. సంఘటనను విశ్లేషించిన పోలీసులు సెల్ఫీ ఒక కారణం కాగా, మద్యం మత్తులో నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ మరో కారణంగా నిర్ధారించారు.


సెల్ఫీలు ఎలా కార‌ణం అవుతున్నాయంటే...ఇటీవల ప్రారంభమైన ఈ బయోడైవర్సిటీ ఫ్లైఓవర్‌ పై నుంచి చూస్తే ఐటీ కారిడార్‌ అత్యంత విలాసవంతమైన భవనాలు, లైట్లతో జిగేల్‌ మంటూ విరజిమ్ముతున్న వెలుతురు విదేశీ లొకేషన్‌ను తలపిస్తోంది. దీంతో వాహనదారులే కాదు ఫొటోల కోసం పాదచారులు కూడా ఆసక్తి చూపుతు ఫ్లెఓవర్‌ పైకి ఎక్కి ప్రమాదకరమైన స్థాయిలో సెల్ఫీలు దిగుతూ కలవరం రేపుతున్నారు. ఈ నేపథ్యంలో వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 


సెల్ఫీల గోల మొదలు కావడంతో ట్రాఫిక్‌ పోలీసులు వారిని అప్రమత్తం చేసేందుకు పబ్లిక్‌ అనౌన్స్‌మెంట్‌ సిస్టంను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. రెండు మూడు రోజుల్లో దీనిని ప్రారంభించేందుకు పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సిస్టం ప్రారంభం కాగానే సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షించే కమాండ్‌ కంట్రోల్‌ సిబ్బంది మైక్‌ ద్వారా అనౌన్స్‌ చేస్తూ అక్కడ సెల్ఫీలు దిగవద్దని హెచ్చరిస్తుంది. ఇలా 24/7 ఈ ఫ్లైఓవర్‌పై రాకపోకలను పోలీసులు గమనించనున్నారు. ఈ విధంగా సెల్ఫీలతో ప్రమాదాల బారిన పడకుండా ట్రాఫిక్‌ పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: