గ‌ల్ఫ్ దేశ‌మైన కువైట్‌లో కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ రాజీనామా చేశారు. తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతోపాటు యావత్ తన క్యాబినెట్ రాజీనామా లేఖను కువైట్ రాజుకు అందజేశారు. అంతర్గత విభేదాలు, పేలవ పనితీరు, మంత్రుల మధ్య ఘర్షణ, పార్లమెంట్ సభ్యుల ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. కాగా, ప్రభుత్వ పెన్షన్ సంస్థ నుంచి రిటైర్డ్ ఉద్యోగులు తీసుకున్న రుణాలపై ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వడ్డీరేటు వసూలు చేస్తున్నారని ఆరోపణలు రావడంతో గత నెలలోనే ఆర్థిక మంత్రి అల్ హజ్రఫ్ రాజీనామా చేశారు. 


 తదుపరి ప్రభుత్వ ఏర్పాటు కోసం తనతోపాటు యావత్ తన క్యాబినెట్ రాజీనామా లేఖను కువైట్ రాజుకు అందజేశారని ప్రభుత్వ అధికార ప్రతినిధి తారిఖ్ అల్ మజ్రేమ్ ఒక ప్రకటనలో తెలిపారు. స్వతంత్ర ఎంపీ సాలేహ్ అషౌర్ మాట్లాడుతూ ప్రస్తుత క్యాబినెట్ కూర్పుపై మంత్రుల మధ్య విభేదాలు తలెత్తడంతోనే ప్రభుత్వం రాజీనామా చేసిందన్నారు. 2011లో కువైట్‌లో పార్లమెంట్ ఏర్పాటైనప్పటి నుంచి ఇది ఎనిమిదో క్యాబినెట్. ప్రభుత్వ రాజీనామా తర్వాత వైదొలుగనున్న ప్రధానిని రాజు తిరిగి నియమించడం గానీ, కొత్త ప్రభుత్వ అధినేతను నియమించడం కానీ చేయొచ్చు. 


ప్రభుత్వ నిధుల వినియోగంలో వైఫల్యం, పనితీరులో పేలవ ప్రదర్శనపై సుదీర్ఘ కాలం పార్లమెంట్ నిలదీస్తుండటంతో ప్రజా పనులశాఖ మంత్రి జెనన్ బుషెహ్రీ తన రాజీనామా లేఖను సమర్పించారు. ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించి వడ్డీరేటు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో ప‌డేశాయి. ప్రభుత్వ పెన్షన్ విష‌యంలో, రుణాల విష‌యంలో ప్ర‌తిప‌క్షాలు, ప్ర‌జ‌ల నుంచి వ్య‌తిరేకత రావ‌డంతో...కువైట్ ప్రధాని షేక్ జబేర్ ముబారక్ రాజీనామా చేయ‌క త‌ప్ప‌లేద‌ని విశ్లేష‌కులు అంటున్నారు. త్వ‌ర‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: