స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలని వైయస్‌ఆర్‌సీపీ నేతలు ఫిర్యాదు చేశారు. శుక్రవారం సచివాలయంలో అసెంబ్లీ కార్యదర్శిని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు జోగి రమేష్‌, కైలే అనిల్‌కుమార్‌ కలిసి టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, నారా లోకేష్‌, కూన రవిలపై ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికార ఈ-పేపర్‌లో స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ప్రజాస్వామ్యంలో కొన్ని పదవులకు ఎన్నో అధికారాలు ఉంటాయి.


సామాన్య నాయకుడైనా సరే ఆ పదవిలోకి వచ్చే సరికి బలవంతుడవుతాడు.. అసెంబ్లీ ప్రజాస్వామ్యంలో స్పీకర్ కు చాలా పవర్స్ ఉంటాయి. ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సభాహక్కుల ఉల్లంఘన కింద వస్తుంది. ఇప్పుడు ఇదే అంశంపై టీడీపీ యువ నేత నారా లోకేశ్ ను బుక్ చేసేందుకు వైసీపీ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ మేరకు తమ ప్లాన్ ఏంటో వైసీపీ నేతలే బయటపెట్టారు.


శాసనసభ సభాపతి స్థానాన్ని భంగం కలిగించేలా విమర్శలు చేసిన ముగ్గురు తెలుగుదేశం నాయకులపై సభా హక్కుల ఉల్లంఘన కింద నోటీసులు ఇవ్వనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఇప్పటికే తెలిపారు. తెలుగుదేశం ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు, ఎమ్మెల్సీ లోకేష్, ప్రభుత్వ మాజీ విప్ కూన రవికుమార్ కు నోటీసులు పంపిస్తామని ..మాల్లాది విష్ణు కూడా అన్నారు. అసభ్య పదజాలంతో శాసనసభ సభాపతి తమ్మినేని సీతారాంను ప్రతిపక్ష నాయకులు దూషించారన్నది వైసీపీ ఆరోపణ.


ఎమ్మెల్సీ లోకేష్ లేఖల రూపంలో స్పీకర్ స్థానాన్ని కించపర్చేలా వ్యాఖ్యలు చేశారని వారు చెబుతున్నారు. సభాపతి గౌరవాన్ని భంగపర్చేలా వ్యాఖ్యలు చేయడాన్ని వైసీపీ సీరియస్ గా తీసుకుంటోంది. ప్రభుత్వ, వైసీపీ సమన్వయ కమిటీ సమావేశంలో సభాపతిపై అనుచిత వ్యాఖ్యల అంశం ప్రధానంగా చర్చకు వచ్చింది. నారా లోకేశ్ సహా మిగిలిన ఇద్దరిపైనా క్రిమినల్ చర్యలు తీసుకునే అంశం పరిశీలనలో ఉందంటున్నారు వైసీపీ నేతలు .


మరింత సమాచారం తెలుసుకోండి: