తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత‌, ముఖ్య‌మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు త‌న పార్టీ సీనియ‌ర్‌, మంత్రి ఈటల రాజేందర్ విష‌యంలో..దూకుడుగా వెళ్లకూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు స‌మాచారం. ఆయ‌న్ను టార్గెట్ చేయ‌డంలో భాగంగా త‌మ అనుకూల మీడియాలో ఉద్దేశ‌పూర్వ‌క వార్త‌లు వ‌చ్చేలా చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి...దానికి కొన‌సాగింపుగా చేసే త‌దుప‌రి చ‌ర్య‌కు విరామం ఇచ్చిన‌ట్లు చెప్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్ కుమార్తె నీత వివాహం నేప‌థ్యంలో ఈ చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.


తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్  ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రెవెన్యూ చట్ట ప్రక్షాళనకు సంబంధించిన అంతర్గత వ్యవహారాలను ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ అధికారులకు లీక్‌ ‌చేసిన‌ట్లుగా కేసీఆర్ భావించారు. రెవెన్యూ శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పూర్తిగా ప్రక్షాళన చేయాలన్న గట్టి పట్టుదలతో ఉండి రెండ్రోజుల పాటు మంత్రులు, కలెక్టర్లతో సుదీర్ఘంగా చర్చించారు. కొత్త రెవెన్యూ చట్టం తెచ్చేందుకు గానూ … రెవెన్యూ ప్రక్షాళనకు సంబంధించి తన మదిలో ఉన్న అభిప్రాయాలను, ఆలోచనలను సిఎం కేసీఆర్‌ ‌సహచర మంత్రులకు, జిల్లాల కలెక్టర్లకు సవివరంగా వివరించారు. ఈ రెండ్రోజుల సమావేశాలలో రెవెన్యూ ప్రక్షాళన, కొత్త చట్టం, విధి విధానాలకు సంబంధించి ఖరారు చేసిన వివరాలను చట్టం రూపంలో బయటకు వచ్చేంత వరకు ఎట్టి పరిస్థితులలోనూ బయటకు పొక్కనివ్వరాదనీ మంత్రులు, కలెక్టర్లు, ఉన్నతాధికారులకు సీఎం కేసీఆర్‌ ‌తనదైనశైలిలో హుకూం జారీ చేశారు. అయితే, ఈటల రాజేందర్‌ ‌రెవెన్యూ శాఖలోని కీసర ఆర్డీవో లచ్చిరెడ్డికి శామీర్‌పేటలోని తన ఫాంహౌజ్‌లో పూసగుచ్చినట్లు వివరించారనీ, ఈటల రాజేందర్‌ ‌లీకులతోనే రెవెన్యూ అసోసియేషన్‌ ‌ప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళన బాటకు సిద్ధమైనట్లు ప్రభుత్వాధినేత కేసీఆర్‌కు సమాచారం అందిందని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో...ఈట‌ల‌ను కేసీఆర్ టార్గెట్ చేశారు.


అయితే, తాజాగా నెల‌కొన్న ప‌రిణామాల నేప‌థ్యంలో...ఈటల రాజేందర్‌పై త‌క్ష‌ణ‌మే ఘాటు స్పంద‌న స‌రికాద‌ని భావించిన‌ట్లు స‌మాచారం. అందుకే ఈటల రాజేందర్ కుమార్తె నీత వివాహం మేడ్చల్‌లోని ఈటల స్వగృహంలో నిర్వ‌హించ‌గా సీఎం కేసీఆర్, శోభ దంపతులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.  దీంతో మునుప‌టి అంత ఆగ్ర‌హంగా కేసీఆర్ లేర‌ని ప‌లువురు భావిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: