జగన్మోహన్ రెడ్డి ఎంపిలకు క్లాసు తీసుకున్నారా ? ఇపుడిదే అంశంపై పార్టీలో చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించేందుకు జగన్ పార్టీ ఎంపిలతో శుక్రవారం సాయంత్రం భేటి అయిన విషయం తెలిసిందే.  ఈ భేటి సందర్భంగా జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం.

 

ఎంపి కూడా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి లేకపోతే లోక్ సభ నేత మిథున్ రెడ్డికి తెలియకుండా నేరుగా ఎవరినీ కలిసేందుకు లేదని చెప్పారట. కొందరు ఎంపిలు స్వతంత్రంగా ప్రధానమంత్రిని కలిసేందుకు ప్రయత్నించటం కేంద్రమంత్రులను కలవటాన్ని జగన్ తీవ్రంగా ఆక్షేపించినట్లు తెలిసింది.  ఎవరికి వారుగా స్వతంత్రంగా వ్యవహరించటం వల్ల పార్టీకి నష్టం జరుగుతుందన్న విషయాన్ని అందరూ గ్రహించాలని చెప్పారు.

 

ప్రధానమంత్రి, కేంద్రమంత్రులను కలవటంలో తప్పేమీ లేదని కాకపోతే వారిని కలిసేముందు విజయసాయిరెడ్డి, మిధున్ రెడ్డిలతో మాట్లాడాలని స్పష్టంగా చెప్పేశారట. రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులు, నిలిచిపోయిన నిధుల లాంటి విషయాలపై విజయసాయి, మిధున్ దగ్గర ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని కూడా చెప్పారట.

 

 అలాగే  పార్టీ లైన్ దాటకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఎంపిలందరి మీదా ఉందని గుర్తు చేశారట. టివి చర్చల్లో మాట్లాడేటపుడు కొందరు ఎంపిలు తమ వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పటాన్ని తప్పు పట్టినట్లు సమాచారం. టివి చర్చల్లో మాట్లాడేటపుడు తాము చెప్పే అభిప్రాయాలను జనాలందరూ చూస్తారన్న విషయాన్ని మరచిపోకూడదని గుర్తుచేశారు. పార్టీ అభిప్రాయాలే తప్ప వ్యక్తిగత అభిప్రాయాలను చర్చా కార్యక్రమాల్లో చెప్పకూడదని హెచ్చరించారు.

 

సరే తర్వాత శీతాకాల సమావేశాల్లో పార్టీ తరపున అనుసరించాల్సిన విధానంపై అందరికీ స్పష్టత ఇచ్చినట్లు సమాచారం. ప్రత్యేకహోదా, ప్రత్యేక రైల్వేజోన్, లోటుబడ్జెట్ సాధించటం, పోలవరం ప్రాజెక్టు అయిన ఖర్చులను తిరిగి రాబట్టటం లాంటి అనేక అంశాలపై సూచనలు చేశారు. మొత్తం మీద ఎంపిలతో చాలా వివరంగానే జగన్ మాట్లాడినట్లు అర్ధమవుతోంది. పార్టీ అధినేత అన్న తర్వాత ఆ మాత్రం ఎంపిలతో గట్టిగా మాట్లాడకపోతే ఎలా ?


మరింత సమాచారం తెలుసుకోండి: