సొంతపార్టీ ఎంఎల్ఏలే చంద్రబాబునాయుడుకు షాకుల మీద షాకులు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెడదామని అనుకుంటే చంద్రబాబుకే రివర్స్ షాకు తగులుతోంది. ఇసుక కొరత పేరుతో దీక్ష చేసిన రోజే చంద్రబాబుకు మొదటి షాక్ తగిలింది. దీక్షలో ఎంఎల్ఏలు, ఎంపిలందరూ పాల్గొనాల్సిందేనంటూ ఆదేశించినా కనీసం 13 మంది ఎంఎల్ఏలు గైర్హాజరయ్యారు.

 

అంతమంది ఎంఎల్ఏలు పార్టీ అధినేత కార్యక్రమానికే రాకపోయేసరికి పార్టీలో కలకలం మొదలైంది. పైగా వచ్చిన ఎంఎల్ఏల్లో మరికొందరు కొద్దిసేపుండి తర్వాత మాయమైపోయారట. సరే ఆ విషయంపై రాద్ధాంతం చేస్తే మొదటికే మోసం వస్తుందని భయపడ్డారు. అందుకనే ఆ విషయాన్ని ఎక్కడా ప్రస్తావించకుండా జాగ్రత్తపడ్డారు.

 

సరే దీక్ష  మరుసటి రోజు అంటే శుక్రవారం ఎంఎల్ఏలు, ఎంపిలతో సమీక్ష చేశారు. సమీక్ష విషయాన్ని కూడా అందరికీ పార్టీ కార్యాలయం నుండి సమాచారం అందించారు. అయితే చంద్రబాబు నిర్వహించిన సమీక్షకు కూడా మరో   10 మంది ఎంఎల్ఏలు డుమ్మా కొట్టారట. దీక్ష, మరుసటి రోజు సమీక్షకు ఎంఎల్ఏల గైర్హాజరుతో తలబొప్పి కట్టిన చంద్రబాబుకు షోకాజ్ నోటీసు అందుకున్న ఎంఎల్ఏ వల్లభనేని వంశీ వ్యాఖ్యలు మరింత తలనొప్పిగా మారింది.

 

అదే సమయంలో అడ్రస్ లేని ఎంఎల్ఏల భవిష్యత్ ప్రయాణం ఏమిటో ఎవరికీ అర్ధం కావటం లేదు. ఎవరు ఎన్ని రోజులు టిడిపిలో ఉంటారో అర్ధంకాక సీనియర్ నేతలకు టెన్షన్ పెరిగిపోతోంది.  ఒకవైపు ఎంఎల్ఏల పార్టీ మార్పుపై  బిజెపి నేతల దూకుడుతో టిడిపి నేతల్లో కలవరం పెరిగిపోతోంది.

 

వరుసబెట్టి కొందరు ఎంఎల్ఏలు ఢిల్లీకి వెళ్ళి బిజెపి అగ్రనేతలతో భేటిలు జరిపి వస్తున్నారు. అనగాని సత్యప్రసాద్, గంటా శ్రీనివాసరావు ఈమధ్యనే ఢిల్లీకి వెళ్ళి క్యాంపు వేసిన విషయం తెలిసిందే. గంటా గనుక బిజెపిలోకి మారితే తక్కువలో తక్కువ ఆయనతో పాటు మరో 8 మంది ఎంఎల్ఏలు పార్టీ మారిపోవటం ఖాయమంటున్నారు. మొత్తం మీద పార్టీలో జరుగుతున్న పరిణామాలు చంద్రబాబుకు షాకుల మీద షాకులిస్తున్నాయని మాత్రం అర్ధమైపోతోంది.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: