జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఏపీలో ఇసుక కొరత, ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంపై విపక్షాలు ఆందోళనలు ఉద్ధృతం చేసిన సమయంలో.. అకస్మాత్తుగా పవన్‌ హస్తిన వెళ్లడం చర్చనీయాంశమమైంది. ఆయన.... ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్‌ షాతో పాటు పలువురు బీజేపీ నేతలతో భేటీ కానున్నట్లు  ప్రచారం జరుగుతోంది.


ఢిల్లీ పర్యటనపై గతంలోనే పవన్‌ సంకేతాలిచ్చారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఇటీవల విశాఖలో లాంగ్‌ మార్చ్‌ నిర్వహించారు. ఇసుక కొరత, భవన నిర్మాణ కార్మికుల సమస్యలపై ఏపీ ప్రభుత్వం స్పందించకపోతే ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలను కలుస్తానని ప్రకటించారు. ప్రత్యేక హోదా డిమాండ్‌కు ఇప్పటి వరకు తానొక్కడినే కట్టుబడి ఉన్నానని వెల్లడించారు. అందులో భాగంగానే పవన్‌ కల్యాణ్ హస్తిన వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది.


పవన్ ఢిల్లీ టూర్లో ఎవరెవర్ని కలుస్తారు? వైసీపీపై కేంద్రానికి ఫిర్యాదు చేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. హోదాపై కేంద్రాన్ని అడుగుతారా? రాజకీయ పరిణామాలు ఎలాంటి మలుపు తిరుగుతాయనేది కూడా చూడాల్సి ఉంది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత పవన్‌ అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు.. బీజేపీ సీనియర్‌నేత రామ్‌ మాధవ్‌తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు చర్చించుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఎన్నికల తర్వాత పవన్‌ కూడా కేంద్రంలో బీజేపీ సర్కార్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాల తరుణంలో.. పవన్ టూర్ ఉత్కంఠ రేపుతోంది. 


పవన్ ఢిల్లీ టూర్ పై ఎలాంటి అధికారిక ప్రకటన రాకపోయినా.. టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.   చంద్రబాబే పవన్ ను బీజేపీ పెద్దల వద్దకు రాయబారానికి పంపారని వైసీపీ ఆరోపించింది. అయితే పవన్ హస్తిన పర్యటనతో తమ పార్టీకి సంబంధం లేదని టీడీపీ స్పష్టం చేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: