ఇప్పుడు తెలంగాణాలో అనాధగా మిగిలింది ఏంటంటే టీఎస్ ఆర్టీసీ అని అందరు అనుకుంటున్నారు. ఎందుకంటే రాష్ట్రచరిత్రలోనే ఇంతకాలం ఏ ఆర్టీసీ సంస్ద సమ్మె చేయలేదు. ఇన్ని రోజులనుండి ఒక గుర్తింపు ఉన్న సంస్ద సమ్మె చేస్తున్న పట్టించుకోకుండా ఉండి ప్రజలకు ఇంతలా ఇబ్బంది కలిగించిన ప్రభుత్వంలేదని ప్రతి వారిలో ఒక అసహనం మొదలైంది. ఇకపోతే ఇప్పటికి సమ్మె ప్రారంభమై 42 రోజులు కావస్తుంది. ఇన్ని రోజుల సమ్మెలో ఎందరో ఆర్టీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు.


అయినా మెట్టుదిగని కార్మిక సంఘాలమధ్య మొండివైఖరితో వెళ్లుచున్న ప్రభుత్వం మధ్య సామాన్యులు, నెలజీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న బాధ్యతగల ఆర్టీసీ ఉద్యోగులు నలిగి పోతున్నారు. బయటకు వారి సమస్యను చెప్పుకోలేక లోలోన కుమిలిపోతున్నారు. ఇప్పుడు సమ్మె ఓ చదరంగంలా మారింది. ఇక ఇన్ని రోజులు ఇంతలా త్యాగాలు చేసిన ఆర్టీసీ కార్మిక సంఘాలు ఇప్పుడు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చెయ్యాలనే డిమాండ్‌ని పక్కన పెట్టినా... తమ ఆందోళనల విషయంలో మాత్రం వెనక్కి తగ్గట్లేదు.


సమ్మెలో భాగంగా నిన్న రాష్ట్రవ్యాప్తంగా బైక్ ర్యాలీలు జరిపిన కార్మికులు నేటి నుండి ఇందిరా పార్క్ దగ్గర నిరాహార దీక్షలు చేపట్టబోతున్నారు.  ప్రభుత్వం ఇందుకు అనుమతి ఇవ్వకపోయినా దీక్షలు మాత్రం చేసి తీరతామంటున్నారు. ఐతే పోలీసులు మాత్రం శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందంటు దీక్షలకు అనుమతిని నిరాకరిస్తున్నారు. అంతే కాకుండా దీక్షకు దిగితే చట్టపరంగా చర్యలు కూడా తీసుకుంటామంటున్నారు.


ఒకవేళ పోలీసులు గనక బలవంతంగా తరలిస్తే... ఎంప్లాయీస్ యూనియన్ కార్యాలయంలో దీక్షలు చేయాలన్న ప్లాన్ బీ కూడా కార్మికుల దగ్గర ఉన్నట్లు తెలిసింది. ఇక ఆర్టీసీ యూనియన్ నేత అశ్వత్థామరెడ్డి, ఆర్టీసీ జేఏసీ కో కన్వీనర్ రాజిరెడ్డిపై అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ నమోదైంది. ఈ కంప్లైంట్ మాల మహానాడు అధ్యక్షుడు దీపక్ కుమార్  చేశారు.


ఇప్పటివరకూ ఉద్ధృతంగా సాగిన సమ్మెను ఈ పరిస్థితుల్లో జేఏసీ నేతలు తమ స్వప్రయోజనాల కోసం నీరు గార్చుతున్నారని దీపక్ కుమార్ ఆరోపించారు. ఇప్పటి వరకు ఈ సమ్మెవల్ల 23 మంది ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నాక ఇప్పుడు విలీనం డిమాండ్‌పై ఎందుకు వెనక్కి తగ్గుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: