ఆరేళ్ల చిన్నారిపై  ప‌దమూడేళ్ల బాలుడు అత్యాచారం చేశాడు. ఈ దారుణ సంఘ‌ట‌న గురువారం కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం ఐనపూరు గ్రామంలో జ‌రిగింది. గ్రామానికి చెందిన ఆరేళ్ల పాప స్థానికి ప్రాథ‌మిక పాఠ‌శాల‌లో ఒకటో తరగతి చదువుతోంది. కార్తీకమాసం నేప‌థ్యంలో రోజూ సాయంత్రం స్థానికంగా ఉన్న శివాల‌యం వ‌ద్ద‌కు పూజ‌కు, ప్ర‌సాదానికి వెళ్లి వ‌స్తోంది. అయితే  గురువారం సాయంత్రం ప్రసాదానికి వెళ్లిన పాప రాత్రి 6 దాటినా రాక‌పోవ‌డంతో కంగారు ప‌డిన త‌ల్లిదండ్రులు పాప‌ను  వెతుక్కుంటూ ఆల‌యం వ‌ద్ద‌కు వెళ్లారు. ఆల‌య స‌మీపంలో ఎక్క‌డా క‌నిపించ‌క‌పోవ‌డంతో వారిలో మ‌రింత కంగారు మొద‌లైంది.


ఆలయానికి స‌మీపంలోని రైస్ మిల్లు గుండా గ్రామానికి పాప తండ్రి వెళ్తుండ‌గా కేక‌లు విన‌బ‌డ్డాయి. రైస్‌మిల్లులోకి ప్ర‌వేశించిన తండ్రికి పాప‌పై ఓ బాలుడు అత్యాచారం చేస్తున్న దృశ్యం క‌నిపించింది. వెంట‌నే తండ్రి కేక‌లు వేస్తూ ప‌రుగెత్తుకుంటూ సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నాడు. అయితే పాప తండ్రి రాక‌ను గుర్తించిన బాలుడు అప్ప‌టికే అక్క‌డి నుంచి పారిపోయాడు.  పాపకు తీవ్ర‌ రక్తస్రావం కావడంతో స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు తీసుకెళ్లాడు. అక్క‌డ ప్రాథ‌మిక చికిత్స అనంత‌రం పెద్దాస్ప‌త్రికి త‌ర‌లించారు. అత్య‌చారం జ‌రిగిన‌ట్లుగా వైద్యులు నిర్ధారించారు.


 దీంతో గురువారం రాత్రి పమిడిముక్కల పోలీసు స్టేషన్‌లో బాలిక తండ్రి  ఫిర్యాదు చేశారు. బాలుడిపై ఐపీసీ 376 AB, పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి.శ్రీనివాస్ తెలిపారు. తెలుగునాట వ‌రుస‌గా బాలిక‌ల‌పై జ‌రుగుతున్న సంఘ‌ట‌న‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. అత్య‌చారానికి పాల్ప‌డే వారిలో ఎక్కువ‌గా స‌మీప బంధువులు..తోటి స్నేహితులు..యుక్త వ‌య‌స్సు కూడా స‌రిగ్గా రాని వారే ఉంటుండ‌టం గ‌మ‌నార్హం. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ప్ర‌వ‌ర్త‌న‌పై క‌న్నేసి ఉంచాల‌ని పోలీసులు సూచిస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా ప‌దుల సంఖ్య‌లో పోక్సో కేసులు న‌మోదు కావ‌డం ఆందోళ‌న క‌లిగించే అంశ‌మేన‌ని పోలీసు అధికారులు పేర్కొంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: