కశ్మీర్‌ అంశాన్ని అడ్డం పెట్టుకుని రాద్ధాంతం చేయాలన్న పాకిస్తాన్ కుట్రను మరోసారి తిప్పికొట్టింది భారత్. ప్యారిస్‌లో జరిగిన యునెస్కో సదస్సులో కశ్మీర్‌ అంశాన్ని పాక్‌ లేవనెత్తింది. పాక్ తీరుపై ఆగ్రహం వ్యక్తి చేసిన భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌, ఉగ్రవాదం పాక్‌ డీఎన్‌ఏలోనే ఉందంటూ ఆదేశ ప్రతినిధులను కడిగిపారేశారు.


అంతర్జాతీయ వేదికలపై కశ్మీర్ పై రాజకీయం చేయాలని చూస్తున్న పాకిస్థాన్‌కు భారత్‌ అవకాశం దొరికిన ప్రతిచోట దీటైన సమాధానం ఇస్తూ వస్తోంది. తాజాగా భారత్‌పై విషం చిమ్ముతూ యునెస్కో వేదికను రాజకీయం చేయడాన్ని ఖండించారు భారత ప్రతినిధి అనన్య అగర్వాల్‌. ఉగ్రవాద సిద్ధాంతాలు, తీవ్రవాద భావజాలం లాంటి చీకటి కోణాలకు పాక్‌ అడ్డాగా మారిందన్నారు. 


అణు యుద్ధం, ఇతర దేశాలపై ఆయుధాలు ప్రయోగించడం లాంటి వ్యాఖ్యలు చేసి ఐక్యరాజ్యసమితి వేదికను దుర్వినియోగం చేసిన ఘనత పాక్‌ ప్రధానికే దక్కిందని అనన్య ఎద్దేవా చేశారు. కరడుగట్టిన ఉగ్రవాదులు ఒసామా బిన్‌ లాడెన్‌, హక్కానీ నెట్‌వర్క్‌ లాంటి వారిని ఇటీవల పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషార్రఫ్‌ హీరోలుగా అభివర్ణించడాన్ని గుర్తుచేసి పాక్‌ నిజస్వరూపాన్ని సదస్సు ముందు బట్టబయలు చేశారు. పాక్‌లో మైనారిటీ వర్గాలు, మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాల్ని కూడా అనన్య అగర్వాల్‌ ఈ సందర్భంగా సదస్సుకు వివరించారు. పాక్‌ తప్పుడు ఆరోపణల్ని ఇక ఏమాత్రం సహించబోమని తేల్చి చెప్పారు అనన్య. ఇలాంటి అత్యున్నత వేదికల్ని రాజకీయం చేయడాన్ని ఖండించాలని సభ్యదేశాలకు ఆమె పిలుపునిచ్చారు.


మొత్తానికి అంతర్జాతీయ వేదికపై పాక్ తలదించుకునే పని అయింది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న దేశంగా పేరొందిన ఆ దాయాది దేశం ఎపుడూ కక్షతో రగిలిపోతోంది. భారత్ ను ఎలాగైనా నాశనం చేయాలనే దురుద్దేశంతో పావులు కదుపుతూ ఉంటోంది. సరిహద్దుల్లో సమయం దొరికినపుడల్లా కవ్వింపు చర్యలకు పాల్పడుతూ.. భారత్ తో చెలగాటమాడుతోంది. మన సైనికులు వారి కుయుక్తులను తిప్పికొడుతున్నారు. ఇదిలా ఉండగా అంతర్జాతీయ వేదికపై భారత్ పై నిందలు వేయాలనుకున్న పాక్ కు గట్టిగా బుద్ది చెప్పారు మన ప్రతినిధి అన్య. 



మరింత సమాచారం తెలుసుకోండి: