ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా పరిషత్, మండల, పంచాయతీలకు కాలపరిమితి ముగిసి చాలా నెలలైంది. ఉమ్మడి హైకోర్టు గతంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. కానీ వివిధ కారణాల వలన ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించలేదు. హైకోర్టు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. 
 
ప్రభుత్వం ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన నియమాలను కూడా సిద్ధం చేసింది. గుంటూరు జిల్లా సత్తెనపల్లికి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తి ఏపీ పంచాయతీరాజ్ చట్టంలోని కొన్ని సెక్షన్లు రద్దుచేయాలని తీర్పు వచ్చే వరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు. హైకోర్టు ధర్మాసనం నిన్న ఈ పిటిషన్ పై విచారణ జరిపింది. పిటిషనర్ తీర్పు వచ్చేవరకు ఎన్నికలు నిలిపివేయాలని కోరగా హైకోర్టు ధర్మాసనం పిటిషనర్ అభ్యర్థనను తోసిపుచ్చింది. 
 
పిటిషనర్ తరపు న్యాయవాది మనోహర్ రెడ్డి డాక్టర్ కృష్ణమూర్తి కేసులో రిజర్వేషన్లు 50 శాతానికి మించడానికి వీల్లేదని తీర్పు చెప్పిందని అన్నారు. హైకోర్టు ధర్మాసనం ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ, సీఎస్ లకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వం తరపున వాదనలు వినిపిస్తున్న శ్రీరామ్ మాత్రం ఎన్నికల ప్రక్రియను కొనసాగించాలని కోరారు. 
 
హైకోర్టు ధర్మాసనం ప్రతివాదులకు నోటీసులను జారీ చేస్తూ విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో 2018 సంవత్సరం ఆగష్టు నెలలో పదవీకాలం పూర్తయిన సర్పంచ్, ఎంపిటిసి, జెడ్‌పిటిసి, మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమం అయింది. జనవరి నెల చివరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉందని సమాచారం. బుధవారం రోజున కేబినేట్ సమావేశంలో ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల గురించి చర్చలు జరిపింది. 





మరింత సమాచారం తెలుసుకోండి: