జోగుళాంబ గద్వాల జిల్లాలో రాజకీయ అలజడి రేగింది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న వివాదం తారాస్థాయికి చేరింది. దళిత వర్గానికి చెందిన తనపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారంటూ అలంపూర్‌ ఎమ్మెల్యే అబ్రహం.. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి.రెండురోజుల క్రితం తన నియోజకవర్గ పరిధిలోని ఐజ పట్టణంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలోనూ అబ్రహం.. బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘నా ఇలాకాలో ఇతరుల జోక్యం తగదు. నేనూ ఎమ్మెల్యేనే ఆయనా ఎమ్మెల్యేనే.. పక్క నియోజకవర్గానికి చెందిన ఆయన ఇక్కడ నాపై పెత్తనం చెలాయించే ప్రయత్నం చేస్తున్నారు’ అంటూ బండ్ల కృష్ణమోహన్‌రెడ్డిపై పరోక్షంగా ఫైర్‌ అయ్యారు. దీంతో అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న ఇరువురు మధ్య విభేదాలు ఎట్టకేలకు బట్టబయలయ్యాయి. అయితే ఈ పరిణామాలు ఎటూ దారి తీస్తాయోననే ఆందోళన ఆ జిల్లాలోని గులాబీ కార్యకర్తల్లో ఉత్కంఠను రేపుతున్నాయి.  


త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికలే ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య విభేదాలు సృష్టించాయి. అలంపూర్‌ నియోజకవర్గ పరిధిలోని ఐజ మున్సిపాలిటీలో ఈ సారి తను సూచించిన అభ్యర్థులకే బీ ఫారాలు ఇవ్వాలని.. లేకపోతే ఆయా స్థానాల్లో రెబెల్స్‌ను బరిలోకి దింపి వారిని గెలిపించుకుని తీరుతానంటూ గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి ఫోన్లో తనను బెదిరించారని ఎమ్మెల్యే అబ్రహం ఆరోపిస్తున్నారు. మంచి తనాన్ని చేతకాని తనంగా భావించిచొద్దని సూచించిన అబ్రహం.. పార్టీకి నష్టం చేసే వారు ఎంతటి వారైనా ఉపేక్షించబోనని హెచ్చరించారు. ఇదీలా ఉంటే.. ఇరువురి ఎమ్మెల్యేల మధ్య చిచ్చుకు అదే పార్టీకి చెందిన మరో నేత కారణమనే చర్చ జరుగుతోంది.

ఎంపీటీసీ ఎన్నికల్లోనూ తన ఆధిపత్యం కోసం తను చెప్పిన వారికి టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నం చేసి విఫలమైన సదరు నాయకుడు తాజాగా ‘పుర’పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డితో అబ్రహంకు ఫోన్‌ చేయించినట్లు అధికార పార్టీలోనే చర్చ హాట్‌టాపిక్‌గా మారింది. పరిస్థితి ఇలానే ఉంటే త్వరలోనే జరగనున్న మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో అనే ఆందోళన కార్యకర్తల్లో వ్యక్తమవుతోంది. ఇద్దరు ఎమ్మెల్యే మధ్య నెలకొన్న విభేదాలపై అధిష్టానం ఏ మేరకు స్పందిస్తుంది? ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: