ఇప్పటివరకు బ్యాంకులో డబ్బు డిపాజిట్ చేసిన కస్టమర్లకు రూ. లక్ష మేర ఇన్సూరెన్స్ కవరేజికి సదరు బ్యాంకులు అందించడం జరిగేవి. అయితే ఆ కవరేజ్ మొత్తాన్ని మరింత పెంచేలా కేంద్రం అతి త్వరలో ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు నేడు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మల సీతారామన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ చెప్పారు. ఇటీవల జరిగిన పిఎంసి బ్యాంక్ ఉదంతం తరువాత బ్యాంకులో డిపాజిట్లు చేసే కస్టమర్ల డబ్బుకు మరింత భద్రతనివ్వాలనే ఉద్దేశ్యంతోనే వాటిపై అందించే ఇన్సూరెన్సు సొమ్మును పెంచే యోచనలో ఉన్నట్లు నిర్మల చెప్పారు. 

అయితే ఎంతమొత్తంలో పెంచుతారు అనేది మాత్రం ఆమె స్పష్టం చేయలేదు. అతి త్వరలో దీనిపై క్యాబినెట్ ఆమోదం తెలపనుందని, అలానే ఆ తరువాత జరిగే శీతాకాల సమావేశాల్లో దీనికి సంబంధించి ఒక చట్టము తీసుకువస్తామని ఆమె తెలిపారు. అయితే కోఆపరేటివ్ సెక్టర్‌లో అతి పెద్ద ఎన్‌జీవో అయిన సహకార్ భారతీ డిపాజిట్ ఇన్సూరెన్స్ కవరేజ్ మొత్తాన్ని రూ.5లక్షలకు పెంచాలని డిపాజిటర్ల తరపున డిమాండ్ చేసింది. అనంతరం ఈ విషయమై సవివరంగా కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు లేఖ కూడా రాయడం జరిగింది. వాస్తవానికి బ్యాంక్ డిపాజిట్లకు 1993 నుంచి రూ.లక్ష వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ కొనసాగుతూ వస్తోంది. 

కాగా అంతకముందు రూ.30,000 వరకు మాత్రం ఇన్సూరెన్సు కవరేజ్ ఉండేది. అయితే బ్యాంక్ డిపాజిట్లకు బీమా కవరేజ్ అందించే డీఐసీజీసీ ప్రస్తుతం రూ.100 డిపాజిట్‌కు 10 పైసల ప్రీమియం వసూలు చేస్తోంది. అన్ని బ్యాంకులకు ఇదే వర్తిస్తుంది. 2005 ఏప్రిల్ నుంచి ఈ ప్రీమియం అమలులోకి వచ్చింది. గతంలో ప్రీమియం 8 పైసలుగా ఉండేది. డీఐసీజీసీ లెక్కల ప్రకారం, 2019 మార్చి 31 నాటికి 217.4 కోట్ల ఖాతాల్లో 200 కోట్ల అకౌంట్లకు కవరేజ్ ఉంది. కాగా అతి త్వరలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే ఈ కీలక నిర్ణయంతో కొంతవరకు డిపాజిటర్లలో భయం తొలగడంతో పాటు ఇకపై కొత్తగా డిపాజిట్లు కూడా మరింత పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు మార్కెట్ నిపుణులు....!!  


మరింత సమాచారం తెలుసుకోండి: