ఫైనాన్స్ వ్యాపారితో భూ వివాదం ప‌రిష్క‌రించుకోవ‌డానికి ఓ వ్య‌క్తి మ‌హిళ‌ను ఎర‌గా వేశాడు.. గ‌దిలో మ‌హిళ‌తో చ‌నువుగా ఉన్న వీడియోను ముఠా సాయంతో చిత్రీక‌రించాడు. రూ. 25ల‌క్ష‌లు ఇవ్వాల‌ని లేదంటే ఆ వీడియో సోష‌ల్ మీడియాలో పెడుతాన‌ని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగాడు. అయినా స‌ద‌రు వ్యాపారి బెద‌ర‌క‌పోవ‌డంతో తాళ్ల‌తో క‌ట్టేసి చిత్ర‌హింస‌ల‌కు పాల్ప‌డ్డారు.  ఈ దారుణ సంఘ‌ట‌న  తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట పోలీస్ స్టేష‌న్ ప‌రిధిలో  జ‌రిగింది. 


మండ‌లంలోని మామిడాడకు చెందిన ఫైనాన్స్ వ్యాపారం చేసే  తాడి కేదారమణికంఠరెడ్డికి  కాకినాడలో జై ఆంధ్రా చానల్ నిర్వ‌హించే తేతలి దుర్గారెడ్డికి మ‌ధ్య కొద్ది రోజులుగా స్థల వివాదం న‌డుస్తోంది. ప‌లుమార్లు ఇద్ద‌రి మ‌ధ్య ఒప్పందాలు జ‌రిగినా స‌మ‌స్య ప‌రిష్కారం కాలేదు. దీంతో ఎలాగైనా వివాదంతోనే మ‌ణికంఠ‌రెడ్డిని లొంగ‌దీసుకోవాల‌ని దుర్గారెడ్డి ప‌న్నాగం ప‌న్నాడు.  త‌న చానల్‌లో పనిచేస్తున్న రాకేశ్ అనే వ్యక్తి సాయంతో మహేశ్-అశ్విని అనే భార్యభర్తలను ఇందుకు ఒప్పించాడు. 


ఇందుకు మడికి అశోక్ అనే వ్యక్తి ఇంటికి కేదార మణికంఠరెడ్డిని రప్పించాలనుకున్నారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డితో ఫోన్‌లో ప‌రిచ‌యం చేసుకున్న అశ్విని కొంత‌కాలంగా చ‌నువుగా మాట్లాడ‌టం మొద‌లు పెట్టింది. ఆయ‌న‌కు న‌మ్మకం కుద‌రింద‌ని నిశ్చ‌యించుకున్నాక  అశోక్ ఇంటికి మ‌ణికంఠ‌రెడ్డిని రప్పించింది.  ఇద్ద‌రూ క‌ల‌సి గ‌దిలోకి వెళ్లి ఏకాంతంగా గ‌డుపుతున్న స‌మ‌యంలో దుర్గారెడ్డితో పాటు రాకేష్‌, మ‌హేష్‌లు క‌ల‌సి వీడియో చిత్రీక‌రించిన అనంత‌రం లోప‌ల‌కి ప్ర‌వేశించారు.


రూ.25ల‌క్ష‌లివ్వాలని లేదంటే వీడియోను సోష‌ల్ మీడియాలోకి వ‌దులుతామ‌ని బెదిరించారు. అయినా వ్యాపారి విన‌క‌పోవ‌డంతో చిత్ర‌హింస‌ల‌కు గురి చేశారు. ఈ నెల ఏడో తేదీన ఈ ఘటన జ‌ర‌గ‌గా  8న కేదార్ పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈనెల 14న ఇంద్రపాలెంలో ఒక ఇంటిలో ఉన్న నిందితులు ఆరుగుళ్ల మహేష్, భూరి అశ్విని, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజేష్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన దుర్గారెడ్డి, రాకేష్‌ పరారీలో ఉన్నారని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: