ఆంధ్ర రాష్ట్రంలోని  తెలుగుదేశం పార్టీ నుంచి పలువురు ఎమ్మెల్యేలు బయటకు వస్తారని ప్రచారం జరుగుతూ ఉంది.ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విజయవాడ లో నిర్వహించిన దీక్షకు ఏకంగా పదిహేను మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యారు. వారిలో కొందరు బీజేపీ వైపు వెళ్ళాలి అని చూస్తున్నారని మరి కొందరు వైసీపీ వైపు వెళ్లే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది.


వల్లభనేని వంశీ మోహన్ అయితే తెలుగుదేశం పార్టీ కి రాజీనామా చేసినట్టు గా ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ పై ఆయన తీవ్ర స్థాయి లో ధ్వజమెత్తుతూ ఉన్నారు కూడా. ఇక మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరం వెళ్లిపోయిన దాఖలాలు కనిపిస్తున్నాయి. ఆయన భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారని వార్తలు వస్తున్నాయి.తనతో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలను తీసుకుని ఆయన బీజేపీలో చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అని అంచనా. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్  అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్షమించేది లేదని ఆయన తేల్చి చెప్పారు. ఎవరు ఎటు ఫిరాయించినా అనర్హత వేటు తప్పదని ఆయన వ్యాఖ్యానించారు! తద్వారా రాష్ట్రం లో ఎమ్మెల్యేల ఫిరాయింపుల పై చర్చ జరుగుతున్న వేళ తమ్మినేని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.


ఇది వరకూ అసెంబ్లీ లో కూడా అదే విషయాన్ని ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా అదే విషయాన్ని చెప్పారు. ఫిరాయింపు దారులను తమ ప్రభుత్వం ఎంటర్ టైన్ చేయదని ఆయన అన్నారు. ఫిరాయింపుదారుల పై అనర్హత వేటు తప్పదని స్పీకర్ కూడా అప్పుడు ప్రకటించారు. మరోసారి అదే విషయాన్ని తమ్మినేని పునరుద్ఘాటించడం విశేషం.కాగా, ఇటీవల ఇలాగే కర్ణాటక ఎమ్మెల్యేలు కూడా ఫిరాయింపులు మొదలుపెట్టారు వారికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా పునరాలోచనలో పడినట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: