కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత‌, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మ‌రోమారు సంచ‌ల‌న కామెంట్లు చేశారు. గ‌త కొద్దికాలంగా...ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో నిలుస్తున్న ఆయ‌న తాజాగా కాంగ్రెస్ పార్టీలోని ప‌రిణామాలు, త‌న వ్య‌క్తిగ‌త అంశాల గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. పీసీసీ పదవి ఇస్తే పార్టీ కోసం పూర్తి స్తాయిగా పనిచేస్తాన‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. పీసీసీ పదవి ఇస్తే 2023 ఎన్నికల్లో పోటీ చేయను అని హామీ ఇచ్చారు. ఇందుకోసం ఢిల్లీలో లాబీయింగ్ చేస్తాన‌ని వెల్ల‌డించారు. 


తెలంగాణ రాష్ట్రం అనేక హక్కుల సాధన కోసం, ప్రజల ఆకాంక్ష కోసం సోనియా గాంధీ ఇచ్చారని జ‌గ్గారెడ్డి పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రానికి మంచి చేస్తారని మళ్ళీ ఎన్నుకున్నారని, అయితే ప్రభుత్వం కావాలనే సమ‌స్యల‌ను జటిలం చేస్తుందని మండిప‌డ్డారు. ఆర్టీసీ కార్మికులు హక్కుల సాధన కోసం 43రోజులుగా సమ్మె చేస్తున్నారని జ‌గ్గారెడ్డి తెలిపారు. ఆర్టీసీ విషయంలో కావాలనే ప్రభుత్వం కాలయాపన చేస్తుంద‌ని జ‌గ్గారెడ్డి మండిప‌డ్డారు. 


ఆర్టీసీ సమస్య కేవలం ఆర్టీసీ ఉద్యోగులది అని ప్రజలు అనుకోవద్దని జ‌గ్గారెడ్డి కోరారు. ఆర్టీసీ ప్రైవేట్ పరం అయిన రాష్ట్రాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ ప్రైవేట్ అయితే ప్రజలు నరకం అనుభవిస్తారని ఆయ‌న తెలిపారు. ఆర్టీసీ ప్రైవేటీకరణ చేస్తే ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆర్టీసీ ఉంటేనే ప్రజలకు టిక్కెట్ల ధరలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేట్ వాళ్ళు కేవలం లాభాపేక్షతో పనిచేస్తారని తెలిపారు. పేదవారు,డబ్బులు లేనివారు ఆర్టీసీ బస్సులు ఎక్కుతార‌నే విష‌యాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఆర్టీసీకి ప్రజలు మద్దతు తెలపాలని కోరారు. 19న చేపట్టే సడక్ బంధును సక్సెస్ చేస్తామ‌ని జ‌గ్గారెడ్డి ప్ర‌క‌టించారు. 19 సంగారెడ్డి-బాంబే హైవేను దిగ్బంధనం చేస్తామ‌ని ప్ర‌క‌టించారు. పీసీసీ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ వి.హనుమంతరావు సూచనమేరకు 19న సంగారెడ్డి హైవే బంధు చేప‌ట్ట‌నున్న‌ట్లు వెల్ల‌డించారు. వెంటనే ఆర్టీసీ సమస్యను పరిష్కరించాల‌ని ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రిస్తున్న‌ట్లు జ‌గ్గారెడ్డి తెలిపారు. 


కాంగ్రెస్ పార్టీని  అధికారంలోకి తేవడానికి పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి అడుగుతున్నాన‌ని జ‌గ్గారెడ్డి వెల్ల‌డించారు. ఇప్పటికే త‌న బయోడేటాను అధిష్టానానికి రిజిస్టర్ పోస్ట్ చేశానని తెలిపిన జ‌గ్గారెడ్డి ఈనెల 20వ తేదీ తరువాత ఢిల్లీ వెళ్లి పీసీసీ పదవి కోసం అధిష్టానాన్ని అడుగుతాన‌ని ప్ర‌క‌టించారు. పీసీసీ పదవి ఇస్తే 2023 ఎన్నికల్లో పోటీ చేయబోన‌ని, పార్టీ సూచించిన వ్యక్తిని సంగారెడ్డి నుండి పోటీలో నిలబెడతాన‌ని కాంగ్రెస్ పెద్ద‌ల‌కు జ‌గ్గారెడ్డి ఆఫ‌ర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి మారిన వ్యక్తులు పార్టీపై విమర్శలు చేయొద్దని ఆయ‌న కోరారు. పార్టీలో ఉన్నప్పుడు పొగిడి..వెళ్లిపోయిన తరువాత విమర్శలు చేయడం స‌రికాద‌న్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: