హోరాహోరీగా సాగిన హుజూర్‌నగర్ ఎన్నిక‌ల్లో విజయం సాధించ‌డంలో...క్షేత్ర‌స్థాయిలో క్రియాశీలంగా ప‌నిచేసిన నేత‌కు తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు కీల‌క ప‌ద‌వి ఆఫ‌ర్ చేశారు.రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డిని నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు నియామక ప్రక్రియను చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా నియామక ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. 


హుజూర్ నగర్ ఎన్నిక ఇంచార్జిగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పార్టీ బాధ్య‌త‌లు అప్ప‌గించింది. ఈ బాధ్య‌త‌ల నాటి నుంచి ఆయ‌న క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారం హోరెత్తించారు.  “కాంగ్రెస్ గెలిస్తే ఉత్తమ్ కుటుంబానికి లాభం, టీఆర్ఎస్ గెలిస్తే హుజూర్‌నగర్ ప్రజలకు లాభం” అంటూ జ‌నాల్లోకి చేర‌వేశారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఈ మేర‌కు ప్ర‌చారం నిర్వ‌హించారు. ఎన్నిక‌ల ప్ర‌ణాళ‌ఙ‌క‌ల‌ను సైతం ప‌క్కాగా వేశారు. దీంతో టీఆర్ఎస్ గెలుపొందింది. కాగా, ప‌ల్లా చేసిన కృషిని మంత్రులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేర‌కు తాజాగా కేసీఆర్ ఆయ‌న‌కు ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు.


ప‌ల్లా నియామ‌కంతో పాటుగా రాష్ట్ర రైతు సమన్వయ సమితి సభ్యులను కూడా త్వరలోనే నియమించనున్నట్లు సీఎం వెల్లడించారని ముఖ్య‌మంత్రి కార్యాల‌యం ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది. ``వచ్చే జూన్ లోపు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రైతు సమన్వయ సమితిలను బలోపేతం చేసి, రైతులను సంఘటిత శక్తిగా మార్చాలని సీఎం నిర్ణయించారు. క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణం కూడా పూర్తి చేయాలని సిఎం ఆదేశించారు. విత్తనం వేసే దగ్గర నుంచి పంటకు గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు చేదోడు వాదోడుగా ఉండే విధంగా రైతు సమన్వయ సమితులను పటిష్టమైన పద్ధతుల్లో తీర్చిదిద్దాలని సిఎం భావిస్తున్నారు. రైతు సమన్వయ సమితుల బలోపేతం, రైతులను సంఘటిత శక్తిగా మార్చడం,  రైతు వేదికల నిర్మాణం, ఇతర రైతు సంబంధ అంశాలపై మూడు నాలుగు రోజులలోనే వ్యవసాయ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించాలని సిఎం నిర్ణయించారు.`` అని ఆ ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: