విజయవాడ దుర్గమ్మ సాక్షిగా రాజకీయాలు వేడెక్కాయి.  నవంబర్ 14 వ తేదీన చంద్రబాబు నాయుడు ఇసుక దీక్ష చేసిన సంగతి తెలిసిందే.  ఈ  దీక్ష సమయంలో చంద్రబాబు నాయుడు వైకాపా నాయకులపై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.  ఈ విమర్శలపై వైకాపా నాయకులు బాబుపై విరుచుకుపడ్డారు.  తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన వల్లభనేని నాని బాబుపై విమర్శలు చేశారు.  కాగా ఈరోజు వైకాపా నాయకుడు, మంత్రి కొడాలి నాని సీన్ లోకి వచ్చి.. బాబుపై ఫైర్ అయ్యాడు.  


నాని మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం చాలా తక్కువ.  మీడియా ముందుకు వచ్చినపుడు నాని ఎలాంటి విమర్శలు చేస్తారనే విషయం అందరికి తెలిసిందే.  కాకపోతే ఈరోజు నాని కొంచెం డోస్ పెంచారు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా 2014 నుంచి 2019 వరకు వైకాపాకు చెందిన 23 మంది ఎమ్మెల్యేలను బాబుగారు తన పార్టీలోకి ఎలా తీసుకున్నారో అందరికి తెలిసిందే.  23 మంది ఎమ్మెల్యేలను పశువులను కొన్నట్టుగా బాబు కొన్నాడని నాని విమర్శలు చేశారు.  


వైకాపా నుంచి ఎమ్మెల్యేలను కొన్న పాపం ఊరికే పోలేదని, ఆ పాపమే ఇప్పుడు బాబు పార్టీకి తగిలిందని కొడాలి నాని పేర్కొన్నారు.  దేవినేని అవినాష్ బాబును నమ్మి మోసపోయారని, అందుకే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చారని అన్నారు.  బాబు బి ఫామ్ ఇస్తే బాబుగారి కాళ్ళ దగ్గర అణిగిమణిగి ఉండాలంటే కుదరదని నాని పేర్కొన్నారు.  పార్టీ మారే వ్యక్తుల గురించి మాట్లాడే ముందు.. బాబు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వదిలి వచ్చారో చెప్పాలని ప్రశ్నించారు.  


ఇందిరాగాంధీ రెండు సార్లు బాబుకు ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు బి ఫామ్ ఇచ్చింది.  కాంగ్రెస్ పార్టీలో మంత్రి పదవిని ఇచ్చింది.  మరి నువ్వెందుకు కాంగ్రెస్ పార్టీని వదిలేసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చావని నాని ప్రశ్నించారు.  రాష్ట్రంలో వరదలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇసుక ఎలా తీస్తారని ప్రశ్నించారు.  వైఎస్ జగన్ చిటికేస్తే.. తెలుగుదేశం పార్టీ మొత్తం ఖాళీ అవుతుందని, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ వైకాపా పార్టీ ఆఫీస్ స్టోర్ రూమ్ లో ఉంటుందని అన్నారు.  బాబు ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: