కొద్దిరోజుల పాటు పొలిటికల్‌ థ్రిల్లర్‌ సినిమాను తలపించిన మహారాష్ట్ర రాజకీయాలు ఓ కొలిక్కి వస్తున్నాయి. రాష్ట్రంలోని శివసేన, కాంగ్రెస్‌-ఎన్సీపీ జట్టు కట్టి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు పావులు కదుపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటుపై కొంచెం స్పష్టత వచ్చింది. కానీ తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే విషయం ఇంకా తేలలేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కొలువుదీరే అవకాశం ఉండటంతో సీనియర్‌ నాయకుడే ముఖ్యమంత్రిగా ఉంటే కూటమి బలంగా ఉంటుందని మూడు పార్టీల నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.


మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ముఖ్యమంత్రి విషయంలో కొంత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ పదవి కోసమే బీజేపీతో ఉన్న 30 ఏళ్ల అనుబంధాన్ని శివసేన పక్కన పెట్టింది. శివసేన యువనేత ఆదిత్యఠాక్రేను ముఖ్యమంత్రి చేయాలని ఆ పార్టీ నేతలు బలంగా భావిస్తున్నారు. ఇటు చూస్తే కాంగ్రెస్ సీనియర్‌ నేతలు పృథ్వీ చవాన్‌, అశోక్‌ చవాన్‌లు మహారాష్ట్రకు ముఖ్యమంత్రులుగా పనిచేసినవారే. మరోవైపు ఎన్సీపీలోని అజిత్‌ పవార్‌ ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు ఆదిత్యఠాక్రే ముఖ్యమంత్రి అయితే వీరంతా ఆయన కిందనే పనిచేయాల్సి ఉంటుంది. ఇది కాంగ్రెస్, ఎన్సీపీ సీనియర్‌ నేతలకు మింగుడుపడటం లేదని సమాచారం.  


మరోవైపు శివసేన నాయకుడే మరో 25 ఏళ్లపాటు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా ఏలుతాడని సంజయ్‌ రౌత్ వ్యాఖ్యానించారు. ఆదిత్యను ముఖ్యమంత్రిగా ప్రతిపాదించే ఉద్దేశంతోనే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన తొలి నాయకుడు ఆదిత్యే. ఆయనకు ఎమ్మెల్యే కావడం ఇదే తొలిసారి. రాజకీయాలను దగ్గరుండి చూసినప్పటికీ.. పాలనలో అనుభవం లేదు. ఉద్ధవ్‌ థాక్రేకు కూడా పాలనలో అనుభవం లేకపోయినా..ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. కాబట్టి, ఆయన్నే ముఖ్యమంత్రిని చేస్తే బాగుంటుందని కొందరు కాంగ్రెస్‌-ఎన్సీపీ నేతలు ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. 


ఉద్ధవ్‌ సీఎం అయితే ఆరు నెలల్లోపు ఎన్నికలు జరిగి ఎమ్మెల్యేగా గెలవాల్సి ఉంటుంది. మరోవైపు కర్ణాటకలో కూటమి పరిస్థితే ఇక్కడ పునరావృతం కాకూడదని కాంగ్రెస్‌ భావిస్తోంది. కూటమి ప్రభుత్వంలో ఆ పార్టీ కూడా భాగమైతే పృథ్వీ, అశోక్‌ చవాన్లకు కీలక శాఖలు అప్పగించే అవకాశం ఉంది. ఉద్ధవ్‌ ఠాక్రే అయితే.. సీనియర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని వారు భావిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: