కర్నాటక ఉపఎన్నికల్లో పోటీకి దిగే అభ్యర్ధుల ఆస్తుల వివరాలు చూసి విస్తుపోవడం ఎన్నికల అధికారుల వంతైంది. అనర్హత వేటు పడి ఇప్పుడు పోటీకి అవకాశం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు,18 నెలల కాలంలోనే తన ఆస్తులు ఏకంగా రూ.185 కోట్లు పెరిగినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఆయన ఆస్తుల విలువ రూ.1015 కోట్లుగా చూపారు. ఇదెలా సాధ్యమైందో తెలియక ఈసీ అధికారులు అవాక్కయ్యారు.   


కర్ణాటకలో డిసెంబరు 5న ఉపఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయాపార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు. పోటీకి దిగుతున్న అభ్యర్ధులు.. తమ నామినేషన్లు దాఖలు చేసిన సందర్భంలో ఫైల్ చేసిన అఫిడవిట్లను ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలిస్తుంది. అందులో భాగంగా అనర్హత వేటు పడి ఇప్పుడు పోటీకి అవకాశం దక్కించుకున్న బీజేపీ అభ్యర్థి ఎంటీబీ నాగరాజు తన ఆస్తుల వివరాలను ఆఫిడవిట్ లో పొందుపర్చారు.  


ఎంటీబీ నాగరాజు ఈ ఏడాది ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం.. చరాస్తుల విలువ రూ.419.28కోట్లు. ఆయన భార్య చరాస్తుల విలువ రూ.167.34 కోట్లు. గత 18నెలల్లో ఆయన చరాస్తుల విలువ రూ.104.53 కోట్లు పెరిగినట్లు చూపారు. అదే విధంగా ఆయన భార్య ఆస్తి విలువ రూ.44.95 కోట్లు పెరిగింది. ఆగస్టులో కేవలం ఆరు రోజుల వ్యవధిలో ఆయన ఆస్తుల విలువ రూ. 25.84 శాతం పెరిగినట్లు ప్రకటించడంతో ఎన్నికల ప్రధానాధికారి సైతం విస్తుపోయారు. ప్రస్తుతం నాగరాజు, ఆయన భార్య శాంతకుమారి పేర్ల మీద ఉన్న ఆస్తుల మొత్తం విలువ రూ.1201కోట్లు అని ఎన్నికల అఫిడవిట్ పేర్కొన్నారు.   


కర్ణాటకలో కూటమి ప్రభుత్వం ఈ ఏడాది జులై 23న కూలిపోయింది. బీజేపీ బలపరీక్షలో నెగ్గడంతో జులై 26న యడియూరప్ప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. కూటమి ప్రభుత్వానికి చెందిన 17 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ 17స్థానాలకు డిసెంబరు 5న ఉప ఎన్నికలు జరగనున్నాయి. 



మరింత సమాచారం తెలుసుకోండి: