తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త డిమాండ్ తెర మీదకు వచ్చింది. దాదాపు 10మంది పీసీసీ పదవిపై కన్నేశారు. అధిష్టానం కళ్ళల్లో పడేందుకు ఎవరికి వారే ప్రయత్నాలు జోరుగా సాగిస్తుంటే. పార్టీకి పుల్ టైమ్ లో పని చేసే వ్యక్తికే  అత్యున్నత పదవి కట్టబెట్టాలని అందరికి ట్విస్ట్ ఇచ్చారో నాయకుడు. 


తెలంగాణ లో పీసీసీ నాయకుడి ఎంపికపై చర్చ జోరుగా సాగుతోంది. సాధారణంగా... పీసీసీ పదవికి తనకు ఉన్న అర్హతలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తూ ఉంటారు. ఇప్పటికే 10 మందికి పైగా నాయకులే ఇదే పని చేశారు. అయితే... పీసీసీ రేసులో ఉన్న నేతలు తెరపైకి కొత్త చర్చను తెచ్చారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ నుండి... అధికారానికి కాంగ్రెస్ ఆమడ దూరంలో ఉంది. దీనికి కారణాలు అనేకమైనా.. పార్టీ నాయకత్వ లోపమే ప్రధానమని వారి వాదన.  


ఇప్పటి వరకు పీసీసీ చీఫ్ గా పని చేసిన వాళ్ళంతా.. ఎన్నికల సమయంలో తమ నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. రాష్ట్రం అంతా పర్యటనలు... సమీక్షలు... సమన్వయం చేయడం మానేశారన్నది నేతల వాదన. ఎన్నికల్లో పోటీ చేయకుండా...పార్టీ కోసమే ఫుల్ టైం ఇచ్చేలా ఉండే నాయకుడికి అవకాశం ఇవ్వాలనే చర్చ నడుస్తోంది. అయితే ఈ డిమాండ్ కు ఎందరు మద్దతు ఇస్తారనేది అసలు ప్రశ్న.  


పీసీసీ పదవి ఆశించే వాళ్ళు... వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలనే నిబంధన తెర మీదకు తెచ్చారు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఎన్నికల్లో పోటీ చేయకుండా... పూర్తిస్థాయిలో పార్టీ కోసమే పని చేస్తాననీ... తనకు పీసీసీ అవకాశం ఇవ్వండని స్వీయ నిబంధన విధించుకున్నారు. ఇదే విషయాన్ని సోనియాగాంధీకి కూడా లేఖ రాశారు. పీసీసీ చీఫ్ అవకాశం ఇస్తే... వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేయనని పేర్కొన్నారు. వేరే వ్యక్తిని బరిలో నిలిపి గెలిపిస్తానని అధిష్టానానికి అప్పీల్ చేశారు. మరి జగ్గారెడ్డి ప్రతిపాదనకు ...పీసీసీ రేసులో ఉన్న మిగిలిన నాయకులు సిద్దంగా ఉంటారా? అనేది అసలు ప్రశ్న.  


గతంలోనూ  పార్టీ ఫోరంలో ఇలాంటి చర్చే జరిగింది. పీసీసీ అధ్యక్షుడు గా ఉండే వాళ్ళు..ఎన్నికల్లో పోటీ చేయొద్దని చర్చ జరిగింది. కానీ అమలు కాలేదు. ఇప్పుడు తాజాగా... పీసీసీ చీఫ్ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటేనే..పదవి అని నిబంధన తెర మీదకు వచ్చింది. ఇది సాధ్యం అయ్యే పనేనా వేచి చూడాల్సిందే. 


మరింత సమాచారం తెలుసుకోండి: