పార్టీలు వేరు వేరుగా ఉన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఒక్కటే అని వైసీపీ పదే పదే విమర్శిస్తున్న విషయం తెలిసిందే. అలాగే చంద్రబాబుకు లోకేశ్ పుత్రుడైతే, పవన్ దత్తపుత్రుడు అని అంటున్నారు. వారు అనడం ఏమో గానీ వీరు చేసే రాజకీయం చూస్తుంటే సామాన్య జనానికి కూడా నిజమనిస్తుంది. ఎందుకంటే వీరు ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఒక అవగాహనతో కలిసి పోటీ చేశారని అందరికీ తెలుసు. అలాగే ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్న ఇద్దరు ఒకే విధంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఒకే లైన్ లో పోరాటాలు చేస్తూ, ఒకడుగు ముందుకేసి ఒకరికొకరు మద్ధతు తెలుపుకుంటున్నారు. 


సరే వీరు కలిసే ఉన్నారని దాదాపు అర్ధమైపోయింది. ఈ క్రమంలోనే వీరిద్దరి బంధం మరోసారి బయటపడింది. ఎలాంటి సమాచారం లేకుండా శనివారం పవన్ ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ ఆయన ఎవరిని కలుస్తారు, ఎందుకు కలుస్తారు అనే విషయాలు ఆఖరికి జనసేన నేతలు కూడా తెలియదు. అయితే బాబు...బీజేపీతో రాయబారం నడపడానికి పవన్ ని పంపించారని వైసీపీ వాళ్ళు అనేది నిజమేమో.


ఆ విషయం పక్కనబెట్టేస్తే పవన్ ఢిల్లీ వెళుతూ వెళుతూ ట్విట్టర్లో జాతీయ మీడియా జగన్ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేస్తుందో చూడంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ పెట్టారు. ఇక పవన్ తర్వాత వెంటనే బాబు ట్విట్టర్ లోకి వచ్చారు. ఆరు నెలల్లో 'మంచి' ముఖ్యమంత్రి అనిపించుకుంటానని జగన్ చెప్పారని... కానీ ఐదు నెలల్లోనే రాష్ట్రాన్ని 'ముంచుతున్న' ముఖ్యమంత్రిగా జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారని ఎద్దేవా చేశారు. దీనికి ఈ పత్రికా కథనాలే నిదర్శనమంటూ నవంబర్ 14న  ఓ ప్రముఖ జాతీయ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు.


అయితే ఈ ట్వీట్లతో ఇద్దరు మధ్య బంధం మరోసారి బయటపడితే...అసలు వైసీపీ ప్రభుత్వంపై నెగిటివ్ గా రాస్తున్న జాతీయ మీడియా కథనాలు వెనుక బాబు హస్తం ఉన్నట్లు అంతకముందే వార్తలు వచ్చాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలతో బాబు రహస్యంగా భేటీ అయ్యి, వారి చేత వైసీపీకి నెగిటివ్ గా ప్రచారం చేయిస్తున్నారని తెలిసింది. ప్రతి శుక్రవారం రాత్రి హైదరాబాద్ కు వెళుతున్న బాబు...కొన్ని జాతీయ మీడియా సంస్థలతో రహస్య చర్చలు చేస్తున్నట్లు తెలిసింది. ముఖ్యంగా ఇసుక విషయంపై ఎక్కువ ఫోకస్ పెట్టించినట్లు తెలిసింది. అందుకే ఈ విధంగా నేషనల్ మీడియా వైసీపీ ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: