కొన్నేళ్ల క్రితం వీరబ్రహ్మం గారు చెప్పిన విధంగానే నేటి కాలంలో కొన్ని రకరకాల వింతలు జరుగుతున్నాయి. నిజానికి ఆయన అలా చెప్పడం వల్ల అలా జరుగుతున్నాయా లేక యాదృచ్చికమా అనేది మాత్రం ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. ఇటీవల పలు రకాల వింతలు చూస్తున్న మనం, నేడు మరొక సరికొత్త వింతను గురించి తెలుసుకుందాం. కాలిఫోర్నియాకి చెందిన డాక్టర్‌ రాల్ఫ్‌ ట్రాన్‌ చెందిన క్లినిక్‌లో ఒక పిల్లి నాలుగు నెలల క్రితం రెండు పిల్లలకు జన్మనిచ్చింది. కాగా అందులో ఒకటి మాత్రం మిగతావాటి కంటే బిన్నంగా, రెండు ముఖాలతో పుట్టడంతో డాక్టర్ ఎంతో ఆశ్చర్యపోయారు. అయితే తల్లి మాత్రం దానిని దగ్గరికి కూడా రానివ్వలేదు. 

అది గమనించిన డాక్టర్‌, దానిని పెంచుకోవాలనుకొని భావించి ఇంటికి తీసుకొచ్చాడు. అలానే దానికి డుయో అని పేరు పెట్టాడు. కాగా, ఆ పిల్లి డిప్రోసోపస్‌, క్రానియోఫేషియల్‌ డూప్లికేషన్‌ అనే అరుదైన లోపం ఉన్నట్లు డాక్టర్‌ తెలిపారు. ఇది పుట్టుకతోనే వచ్చే లోపం అని, దానివలన శరీర అవయవాలు అన్నీ ఒకటిగా ఉన్నా ముఖాలు మాత్రం రెండుగా ఉంటాయట. అయితే ముక్కు,నోరు మాత్రం యధావిధిగా పనిచేస్తున్నట్లు డాక్టర్ చెప్తున్నారు. ఇటీవల దానిని తన తల్లి, మరియు సోదరుల వద్దకు చేర్చిన డాక్టర్, అనంతరం డుయో తన సోదరులైన టైనీ టూనా, డాబీలతో పాటు తల్లితో కలిసి ఆడుకుంటున్న ఫోటోలతో పాటు వీడియోనూ ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. అంతే అది చూసిన ప్రతీ ఒక్కరూ డాక్టర్‌ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు. 

వికృత రూపంతో పుట్టిన ఆ పిల్లిని తల్లి కాదన్న మీరు దానిని చేరదీసి ఆరోగ్యవంతంగా తయారు చేశారంటూ పలువురు నెటిజన్లు ఆయనపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే పుట్టిన సమయంలో డుయో చాలా తక్కువ బరువు ఉండడంతో, అది అసలు బ్రతుకుతుందా అనే అనుమానం తనకు వచ్చిందని, కానీ దాని ఆత్మవిశ్వాసం మరియు దేవుని కృప వల్ల రాను రాను తనను తాను శారీరకంగా సంసిద్ధం చేసుకుని నేడు తన తల్లితో కలిసి ఆనందంగా జీవిస్తున్నందకు తనకు ఎంతో ఆనందంగా ఉందని అంటున్నారు డాక్టర్. కాగా ఈ మ్యాటర్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది....!!


మరింత సమాచారం తెలుసుకోండి: