సమాజంలో జరుగుతున్న అత్యాచారాల విషయంలో చట్టాలు మరింత కఠినంగా ఉంటేనే మేలన్నది ప్రజా అభిప్రాయం. ఇకపోతే తొమ్మిది నెలల పసిపాపపై వరంగల్‌లో అత్యంత పాశవికంగా అత్యాచారానికి పాల్పడి హత్యచేసిన ఈ కేసును కేవలం 51 రోజుల్లో విచారణ పూర్తిచేసి మృగాడికి కోర్టు ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రవీణ అలియాస్ పవన్‌ను దోషిగా నిర్ధారించి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది.


ఈ తీర్పును నిందితుడు హైకోర్టులో సవాల్ చేయగా, దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్‌కు ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చింది. దోషి చనిపోయే వరకు జైల్లోనే ఉండాలని స్పష్టం చేసింది. ఇకపోతే ఆగస్టు 7న వరంగల్ కోర్టు తీర్పును వెలువరించగా, గతంలో నిందితుడి తరఫున వాదించటానికి ఎవరూ ముందుకు రాకూడదని బార్ కౌన్సిల్ తీర్మానించింది. ఇదివరకు జరిగిన సంఘటన వివరాలను పరిశీలిస్తే..


ఈ ఏడాది జూన్‌ 18న హన్మకొండకు చెందిన పోలెపాక ప్రవీణ్‌ అలియాస్‌ పవన్‌ (25) అర్ధరాత్రి మద్యం మత్తులో ఓ ఇంటి మేడపైకి ఎక్కి నిద్రిస్తున్న 9 నెలల చిన్నారిని అపహరించి, నిర్మానుష్య ప్రాంతంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి హత్యచేశాడు. ఈ ఘటనపై తెలుగు రాష్ట్రాల్లో జనం పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి నిందితుడిని ఉరి తీయాల్సిందేనని నినదించారు. ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న వరంగల్ పోలీసులు 20 రోజుల్లోనే దర్యాప్తు పూర్తిచేశారు.


నిందితుడిపై అపహరణ, అత్యాచారం, హత్య తదితర నేరాలతోపాటు లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టం (పోక్సో) కింద కేసులు నమోదు చేశారు. అంతే కాకుండా 30 మంది సాక్షులను విచారించి కోర్టులో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. ఇకపోతే ఈ దుర్మార్గానికి పాల్పడిన ప్రవీణ్‌కు ఉరేసరి అని న్యాయమూర్తి కె.జయకుమార్‌ సంచలన తీర్పు వెల్లడించగా, తాజాగా, ఈ తీర్పును సమీక్షించిన హైకోర్టు నిందితుడు ప్రవీణ్‌కు శిక్ష తగ్గించింది. తుదిశ్వాస విడిచే వరకు ప్రవీణ్‌ను జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది.. కాని ప్రజలు మాత్రం ఇలాంటి మృగానికి ఉరిశిక్ష సరైన తీర్పని అంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: