జాతీయ మీడియా , అంతరాష్ట్ర సంబంధాల సలహాదారు ఏరికోరి నియమించిన  దేవులపల్లి అమర్ పనితీరు పట్ల ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారా ? అంటే అవుననే ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ పనితీరు ను విమర్శిస్తూ రెండు జాతీయ పత్రికలు కథనాలు ప్రచురించగా , వాటిని ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు , జనసేనాని పవన్ కళ్యాణ్ లు తమ ట్విట్టర్ ఖాతాల్లో పోస్ట్ చేశారు. దీనితో  జాతీయ మీడియా లో జగన్ సర్కార్ కు వ్యతిరేక కథనాలు వస్తున్న విషయం సామాన్యులకు సైతం తెల్సింది .


 జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జాతీయ మీడియా ఆయనకు అనుకూల కథనాలను ప్రచురించేది , అయితే జగన్  అధికారం లోకి వచ్చిన తరువాత జాతీయ మీడియా దృక్పథం లో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది . దానికి కారణం  రాష్ట్ర ప్రభుత్వం   ఇటీవల మీడియా పై ఆంక్షలను విధిస్తూ తీసుకువచ్చిన జీవోనేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది . ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా , అంతరాష్ట్ర సంబంధాల సలహాదారునిగా నియమించిన తరువాత అమర్,  ఇటీవల ఢిల్లీకి వెళ్లి జాతీయ మీడియా ప్రతినిధులను , మేనేజ్ మెంట్లను కలిశారు . అయితే మీడియా పై ఆంక్షలు విధిస్తూ తీసుకువచ్చిన జీవో వెనుక తమ ప్రభుత్వ ఉద్దేశ్యం ఏమిటన్నది వివరించడం లో అయన పూర్తిగా విఫలమైనట్లు తెలుస్తోంది .


రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కంటే ఎక్కువ వేతనం పొందుతున్న ఈ సీనియర్ జర్నలిస్ట్ , తనకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించలేకపోతున్నారన్న అభిప్రాయంతో జగన్మోహన్ రెడ్డి ఉన్నారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి . భవిష్యత్తులోనైన అమర్ తన పనితీరు మెరుగుపర్చుకోకపోతే ఆ పదవిలో కొనసాగడం కష్టమేనని తెలుస్తోంది .


మరింత సమాచారం తెలుసుకోండి: