ఎస్వీయూ అధికారుల త‌ప్పిదాల‌తో  డిగ్రీ సెమిస్ట‌ర్ ప‌రీక్ష‌ల్లో గంద‌ర‌గోళం నెల‌కొంది. సెంట‌ర్ల కోడ్ ఒక‌టి...కేంద్రం మరోటి హాల్‌టికెట్ల‌పై ముద్రించ‌డంతో ప‌రీక్ష‌ల‌కు హాజ‌రైన విద్యార్థులు తీవ్ర గంద‌ర‌గోళానికి గుర‌య్యారు. శ‌నివారం ప్రారంభ‌మైన ఈ ప‌రీక్ష‌ల‌ను జంబ్లింగ్ ప‌ద్ధ‌తిలో నిర్వ‌హించేందుకు ఎస్వీయూ, యూజీసీ అధికారులు చ‌ర్య‌లు తీసుకున్నారు. అయితే మొద‌టి రోజూ అనేక త‌ప్పిదాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముఖ్యంగా హాల్‌టికెట్ల ముద్ర‌ణ‌లో చోటు చేసుకున్న పొర‌బాట్ల‌తో విద్యార్థులు ఆందోళ‌న‌కు గురికావ‌డంతో కొన్నిచోట్ల ప‌రీక్ష‌లు ఆల‌స్యంగా ప్రారంభ‌మై...ఆల‌స్యంగా ముగిసాయి.


పీలేరులోని సీఎన్ఆర్ డిగ్రీక‌ళాశాల‌లో ( ప‌రీక్ష కేంద్రం నెం020) మొద‌టి సంవ‌త్స‌రానికి చెందిన దాదాపు 399మంది విద్యార్థులు  ప‌రీక్ష రాయాల్సి ఉంది. హాల్ టికెట్‌పై క‌ళాశాల పేరు సీఎన్ ఆర్‌కు బ‌దులుగా  సంజ‌య్ గాంధీ ప్ర‌భుత్వ జూనియ‌ర్ క‌ళాశాల అంటూ ముద్రించారు. దీంతో విద్యార్థులంతా  సంజ‌య్ గాంధీ క‌ళాశాల‌కు చేరుకున్నారు. ఉద‌యం 9 గంట‌ల‌కే ప‌రీక్ష జ‌ర‌గాల్సి ఉన్నా ఒక్క విద్యార్థి సీఎన్ ఆర్ క‌ళాశాల‌కు రాలేదు.  సంజ‌య్‌గాంధీ క‌ళాశాల ప్రిన్సిపాల్ విద్యార్థుల‌కు సీఎన్ఆర్‌లోనే ప‌రీక్ష రాయాల‌ని విద్యార్థుల‌కు చెప్ప‌డంతో విద్యార్థులు ఉరుకులు..ప‌రుగుల‌తో అక్క‌డికి చేరుకున్నారు. 


ఈ ప్ర‌యాస‌లో దాదాపు గంట ఆల‌స్యంగా ప‌రీక్ష ప్రారంభ‌మైంది...12 గంట‌ల‌కు ముగియాల్సిన ప‌రీక్ష ఒంటి గంట వ‌ర‌కు సాగింది. మ‌రి కొన్ని క‌ళాశాల‌కు ప‌రీక్ష ప‌త్రాలు..స‌మాధాన ప‌త్రాలు అంద‌క‌పోవ‌డంతో క‌ళాశాల‌ల నిర్వాహాకులు జిరాక్స్ పేప‌ర్లను అంద‌జేసి ప‌రీక్ష‌లు పూర్తి చేయించారు.  ఇక జ‌బ్లింగ్ ప‌ద్ధ‌తిలోని లోపాలు కొట్టోచ్చిన‌ట్లు క‌న‌బ‌డింద‌ని విద్యావేత్త‌లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 


నాలుగైదు క‌ళాశాల‌ల‌కు చెందిన విద్యార్థుల‌ను క‌లిపి హాల్‌టికెట్ల నెంబ‌ర్ల‌ను రూపొందించి సిట్టింగ్‌ను కేటాయిస్తారు. అయితే చాలా చోట్ల ఒకే క‌ళాశాల‌కు చెందిన విద్యార్థుల‌ను గంప‌గుత్త‌గా మ‌రో క‌ళాశాల‌లో సిట్టింగ్ కేటాయించార‌ని తెలుస్తోంది. త‌ప్పిదాల‌ను స‌రి చేసుకుని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: