తెలంగాణ రాష్ట్రంలో 21 సంవత్సరాల యువతి భవ్యా రెడ్డి డెంగీ వ్యాధి బారిన పడి మృతి చెందింది. మెదక్ జిల్లా హవేళిఘణాపూర్ మండలంలోని నాగాపూర్ గ్రామానికి చెందిన భవ్య ఒక ఇంజనీరింగ్ కాలేజీలో ఫైనల్ ఇయర్ చదువుతోంది. కొన్ని నెలల క్రితం జరిగిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగానికి భవ్య ఎంపికైంది. చిన్నప్పటి నుండి ఎంతో కష్టపడి చదివిన భవ్యకు ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం రావడంతో ఆమె తల్లిదండ్రులు ఎంతో గర్వపడ్డారు. 
 
కానీ ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. పది రోజుల క్రితం భవ్యకు జ్వరం రావడంతో ఆస్పత్రికి తరలించారు. కానీ భవ్యకు జ్వరం తగ్గకపోవటంతో హైదరాబాద్ లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికికి తరలించగా వైద్యులు రక్త పరీక్షలు చేసి డెంగీ వ్యాధి అని నిర్ధారించారు. ఆ తరువాత మెరుగైన చికిత్స కొరకు భవ్య తల్లిదండ్రులు భవ్యను ఒక కార్పొరేట్ ఆస్పత్రికి తరలించారు. కార్పొరేట్ ఆస్పత్రిలో చేర్పించినా భవ్యకు జ్వరం తగ్గలేదు. 
 
ఆ తరువాత భవ్యకు బీపీ పెరగడంతో పాటు ప్లేట్లెట్స్ కౌంట్ 40వేలకు పడిపోయింది. కూతురిని బ్రతికించుకోవాలని భవ్య తల్లిదండ్రులు 12లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ డెంగీ వ్యాధి భవ్య ప్రాణాలను కబళించింది. రెండు రోజుల పాటు వెంటిలేటర్ పై ఉన్న భవ్య శుక్రవారం రోజున మృతి చెందింది. 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టినా భవ్యను కాపాడుకోలేకపోవటంతో భవ్య తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. 
 
తెలంగాణ రాష్ట్రంలోని కలకోట అనే గ్రామంలో 57 సంవత్సరాల తిమోన్ అనే వ్యక్తి డెంగీ వ్యాధి లక్షణాలతో మృతి చెందాడు. 3 లక్షల రూపాయలు తిమోన్ చికిత్సకు ఖర్చయినట్లు తిమోన్ కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఖమ్మం జిల్లాలో డెంగీ వ్యాధితో ఇద్దరు మృతి చెందగా మధిర మున్సిపాలిటీలో 4సంవత్సరాల బాలుడు డెంగీతో ప్రాణాలు విడిచాడు. 



మరింత సమాచారం తెలుసుకోండి: