పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే సర్కార్‌ను టార్గెట్ చేసేందుకు ప్రతిపక్షాలు వ్యూహాలు సిద్ధం చేస్తోండగా.. విపక్షాలకు ధీటుగా సమాధానం ఇచ్చేందుకు పాలక పక్షం సిద్ధమంటోంది. 


పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి మోడీ సహా అన్ని పార్టీల ఫ్లోర్‌ లీడర్లు హాజరయ్యారు. సభా కార్యక్రమాలకు సహకరించాలని అన్ని పార్టీలను కోరారు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా. ఎన్డీయే నుంచి శివసేన వైదొలగడంతో.. పార్లమెంట్‌ ఉభయసభల్లో ఆ పార్టీ ఎంపీల స్థానాలు మారాయి. ప్రతిపక్ష పార్టీల శిబిరంలోకి శివసేన సభ్యుల స్థానాలను మార్చారు. 


మరోవైపు పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహంపై అయా పార్టీలు వ్యూహాలు రచించాయి. నిరుద్యోగం, ఆర్ధిక మందగమనం, వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు కాంగ్రెస్ సహా.. ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి.  అటు విపక్షాల ఆరోపణల్ని ధీటుగా తిప్పికొట్టేందుకు కమలదళం సై అంటోంది. 


ఇటు ఉభయసభల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై తెలుగు రాష్ట్రాల అధికార విపక్షాలు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించాయి.  విభజన చట్టంలోని అంశాలు, సమస్యలు సహా రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్ట్‌ల అంశాల్ని ఉభయసభల్లో గట్టిగా విన్పించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అలాగే ఏపీకి సంబంధించి  పోలవరం, కడప స్టీల్‌ ప్లాంట్, రామాయపట్నం పోర్టు అంశాలే తమ ప్రధాన ఎజెండా అంటోంది వైసీపీ. ఇటు అమరావతి అంశాన్ని లోక్‌సభలో ప్రస్తావించేందుకు టీడీపీ సిద్ధమవుతోంది. 


మొత్తానికి ఈ సారి పార్లమెంట్ సమావేశాలు మహా ఉత్కంఠగా సాగనున్నాయి. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల ఎంపీలు ఎవరికి వారు పై చేయి సాధించేందుకు పోటీ పడుతున్నారు. పలు అంశాలపై సభలో లేవనెత్తి అధికార బీజేపీ నుంచి నిధులు రాబట్టేలా ప్లాన్ సిద్ధం చేశారు. తన నియోజక వర్గాల్లో అభివృద్ధి పనులు జరగాలంటే కావాల్సిన నిధులు రావాల్సిందేనని పట్టుబట్టనున్నారు. అంతేకాదు చాలా ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న పలు సమస్యలపై కూడా ప్రస్తావించనున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: