ఏపీ అసెంబ్లీ శీతాకాల సమావేశాల ముహూర్తం దాదాపు ఖరారైంది. డిసెంబర్  మొదటి వారంలో సమావేశాలు ప్రారంభమయ్యే  అవకాశాలున్నాయి. ఇలాంటి తరుణంలో టీడీపీ నుంచి సస్పెండ్ అయిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ.. తెలుగుదేశానికి దూరమవుతారని ప్రచారంలో ఉన్న ఇతర ఎమ్మెల్యేపైనా ఆసక్తికర చర్చ జరుగుతోంది.  


వైసీపీకి మద్దతిస్తానన్న గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్‌ చేసిన టీడీపీ.. ఆయనపై అనర్హత వేటు వేసే దిశగా ఫిర్యాదు చేయలేదు. టీడీపీ సస్పెండ్‌ చేసినా ఎమ్మెల్యే కొనసాగే అవకాశం ఉంది. దీంతో త్వరలో మొదలయ్యే అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో వంశీ సీటు ఎక్కడనే  చర్చ మొదలైంది. టీడీపీ సభ్యులతోనే కలిపి కూర్చుంటారా? లేక ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారా? అనేది తేలాల్సి ఉంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికార వైసీపీతో కలిసి కూర్చునే అవకాశం లేదు. మరోవైపు అసలు టీడీపీ ఎమ్మెల్యేల్లో ఎంతమంది సభకు హాజరవుతారు? పార్టీ వీడాలనుకుంటున్న వారు ప్రత్యేకంగా కూర్చుంటారా?  లేక వంశీతో కలిసి కూర్చుంటారా? అన్న చర్చ సాగుతోంది. అసెంబ్లీ సమావేశాల సమయానికి టీడీపీ ఎమ్మెల్యేల్లో ఉండేదెవరు? వీడి వెళ్లేదెవరు? అనే అంశంపైన స్పష్టత  వస్తుందని అంచనా వేస్తున్నారు.  


పార్టీ సస్పెండ్‌ చేయడంతో టీడీపీ ఎమ్మెల్యేలతో కలిసి వంశీ కూర్చునే అవకాశం లేదు. ఆ విధంగా కూర్చోవడానికి వంశీ సైతం సిద్ధంగా లేరనే వాదన వినిపిస్తోంది. పైగా వంశీని సస్పెండ్‌ చేసినట్లు స్పీకర్‌ కార్యాలయానికి టీడీపీ తెలియజేయాలి. అప్పుడే ఆయన్ని స్వతంత్ర ఎమ్మెల్యేగా గుర్తించి ప్రత్యేకంగా సీటు కేటాయిస్తారు. సస్పెన్షన్‌ ఎత్తేసే వరకూ ఇండిపెండెంట్‌గానే పరిగణిస్తారంటున్నాయి అసెంబ్లీ వర్గాలు. ఒకవేళ ప్రత్యేకంగా సీటు కేటాయిస్తే మాత్రం.. ఇసుక, ఇంగ్లీష్‌ మీడియం అంశాలపై జరిగే చర్చలో ప్రభుత్వానికి మద్దతుగా వంశీతో మాట్లాడించాలనే ఆలోచనలో అధికార పార్టీ ఉన్నట్లు సమాచారం. 


మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు దాదాపు పార్టీని వీడినట్లుగానే టీడీపీ భావిస్తోంది. అయితే గంటా ఎక్కడా పార్టీ  వ్యతిరేక వ్యాఖ్యలు చేయలేదు. చంద్రబాబు ఆదేశాలను ధిక్కరిస్తూ పవన్ కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌కు గైర్హాజరయ్యారు. అయినా గంటాపై క్రమశిక్షణ చర్యల దిశగా చర్చ జరగలేదు. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలను కలిసి ఆ పార్టీలో చేరేందుకు ఆయన సిద్ధమైనట్లు తెలిసింది. త్వరలోనే అధికారికంగా ఈ చేరిక ఉంటుందని అంటున్నారు. అందుకే గంటా కదలికలను చూసి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది టీడీపీ. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా ఎవరైనా ఎమ్మెల్యేలు పార్టీ వీడినా... అధికార పార్టీకి మద్దతుగా మాట్లాడినా వారిపై సస్పెన్షన్ కే తెలుగుదేశం పరిమితం అయ్యే అవకాశం కనిపిస్తోంది. గుంభనంగా ఉండే ఎమ్మెల్యేలు బహిరంగంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా.. నేరుగా అసెంబ్లీకి వచ్చి వంశీ పక్కన కూర్చున్నా ఆశ్చర్యం లేదని అనుకుంటున్నాయి పార్టీ వర్గాలు. 


ఇసుక, ఇంగ్లీష్‌ మీడియం అంశాలపై చంద్రబాబుకు పార్టీ ఎమ్మెల్యేల్లోనే ఎక్కువ మంది నుంచి మద్దతు రావడం లేదు. ఆయన దీక్షకు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అందుకే టీడీపీని వీడాలనుకుంటున్న ఎమ్మెల్యేలు ఏం చేస్తారన్నది ఆసక్తిగా మారింది. అలాంటి ఆలోచనలో ఉన్నవారు ఈ అసెంబ్లీ  సమావేశాలకు దూరంగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదనే వాదన వినిపిస్తోంది. ఈ విషయం పసిగట్టిన టీడీపీ పెద్దలు.. అసంతృప్తులను బుజ్జగించే పనిలోపడినట్లు తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: