గ‌త కొద్దికాలంగా, రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా నిలుస్తున్న హైద‌రాబాద్ దేశ రెండో రాజ‌ధాని అంశంపై కీల‌క క్లారిటీ వ‌చ్చింది. బీజేపీ గేమ్ ప్లాన్‌లో భాగంగా, రాజ‌కీయ‌ప‌ర‌మైన ఎత్తుగ‌డ‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని...హైద‌రాబాద్‌కు ఈ హోదా క‌ట్ట‌బెట్ట‌నుంద‌ని ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు. ఈ త‌రుణంలో...బీజేపీ ఎంపీ, కేంద్ర హోం శాఖ స‌హాయ‌మంత్రి జి.కిష‌న్ రెడ్డి కీల‌క క్లారిటీ ఇచ్చారు. హైద‌రాబాద్ రెండో రాజ‌ధాని అంశం కేంద్రం ప‌రిశీల‌న‌లో లేద‌న్నారు.


హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో మాట్లాడిన కిష‌న్ రెడ్డి శీతాకాల సమావేశాలు సోమ‌వారం నుంచి మొదలు  కానున్నాయ‌ని తెలిపారు. గత పార్లమెంట్ సమావేశాల్లో 370 ఆర్టికల్ రద్దు, త్రిబుల్ తలాక్ బిల్లు తీసుకువచ్చామని చెప్పారు. 370 రద్దుతో  కాశ్మీర్ ప్రశాంతంగా ఉందన్నారు. ప్ర‌స్తుత స‌మావేశాల్లో పార్లమెంట్లో త‌మ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామ‌ని ప్ర‌క‌టించారు. ప్రతిపక్షలు ఏ అంశంపై ప్ర‌తిపాద‌న పెట్టినా చ‌ర్చించేందుకు తాము సిద్దమేన‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి ప్ర‌క‌టించారు. విద్యావిధానం, వైద్య విధానం, నదుల అనుసంధానంపై చర్చ జరుపుతామని తెలిపారు. దేశవ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, వైద్యం,విద్య వంటి మౌళిక వసతుల కల్పనే ప్రధాన ధ్యేయమ‌ని వెల్లడించారు.


బీజేపీ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవ‌ల మీడియాతో మాట్లాడుతూ....హైదరాబాద్‌ దేశానికే రెండో రాజధాని కావొచ్చని పేర్కొన్నారు. అయితే దీనికి కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్ రెడ్డి ఈ సంద‌ర్భంగా క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్ దేశానికి రెండో రాజధాని చేయాల‌నే ప్రతిపాదన ప్రస్తుతానికి త‌మ వ‌ద్ద‌ లేదని కొట్టిపారేశారు. దేశంలో ఉగ్రవాదం పీచ మ‌ణిచేలా పని చేస్తామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వ‌యం చేసుకొని పని చేస్తామ‌ని వివ‌రించారు. ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని అంశమ‌ని తెలిపిన ఆయ‌న రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడి కార్మికుల తో చర్చలు జరపాలని కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామ‌ని గత కాంగ్రెస్ ప్ర‌భుత్వం కానీ బీజేపీ ప్ర‌భుత్వం కానీ చెప్పలేదని కిష‌న్ రెడ్డి అన్నారు. ఆంద్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చామని తెలిపిన ఆయ‌న పునర్విభజన చట్టంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా అంశం బిల్లులో ఎందుకు పెట్టించలేదో కేసీఆర్‌ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: