విశాఖలో నయవంచకుడు వంకా అజిత్ కుమార్ ఆకృత్యాలు తవ్వేకొద్దీ బయటపడుతున్నాయి. సోషల్ మీడియాలో ఫేక్ ఐడీలతో మహిళలను టార్గెట్ చేసి...వారి వ్యక్తిగత జీవితాలతో ఆడుకున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. స్లిమ్, బ్యూటీ టిప్స్ పేరుతో మహిళలను ముగ్గులోకి దించేవాడనీ... ఇలా అతగాడి బాధితులు  25మందికి పైగానే ఉన్నట్టు తెలుస్తోంది. 


వంకా అడిత్ కుమార్. పేరుకు తగ్గట్టే అతని మైండ్‌సెట్ అంతా వంకరబుద్ధే.  కారు డ్రైవర్‌గా పనిచేసే కంచరపాలెం వంకా కుమార్‌... విశాఖలో అనేక మంది అమాయక మహిళలు, యువతులను లోబరుచుకున్న బాగోతం బయటపడింది. వంకా అజిత్‌ కుమార్‌ను అరెస్ట్ చేసి కటాకటాల్లోకి నెట్టారు కంచరపాలెం పోలీసులు. ఈ కామ కుమార్‌ చేతిలో మోసపోయిన బాధితులొక్కక్కరుగా బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. 


అజిత్ కుమార్ విశాఖలోని కంచరపాలెంలో  ఉంటున్నాడు. అతడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పలు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్యుడినంటూ, తన వద్ద ఉన్న ఫేక్ ఐడీ కార్డులతో మహిళలు, యువతులు పరిచయం చేసుకుంటాడు. ఉదయం పూట బీచ్ రోడ్డులో నడిచే వాకర్స్‌ను టార్గెట్ చేస్తూ పరిచయం పెంచుకుంటాడు. లావుగా ఉన్నారనీ, డైట్ అవసరమని చెప్పి తన ఫోన్ నెంబర్ ఇస్తాడు. అలా పరిచయం అయిన వాళ్ళతో ఫేస్‌బుక్ ద్వారా కనెక్ట్ అవుతాడు. వారితో సాన్నిహిత్యం పెంచుకుని శారీరకంగా లోబర్చుకుని వీడియోలు తీసేవాడు. ఆ వీడియోలతో బెదిరించి డబ్బు, నగలు అందినకాడికి దోచుకునేవాడు. అలా అజిత్ కుమార్ చేతిలో మోసపోయిన ఓ మహిళ స్పందన కార్యక్రమం ద్వారా పోలీసులను ఆశ్రయించడంతో బండారం బయటపడింది.


అజిత్ కుమార్‌ను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు పోలీసులు. మరోవైపు ఈ కేసును లోతుగా దర్తాప్తు చేసేందుకు నిందితుడిని పోలీసులు కస్టడీకి తీసుకుంటున్నారు. కామ కుమార్ చేతిలో మోసపోయిన వారు నేరుగా ఫిర్యాదు చేయవచ్చన్నారు పోలీసులు. బాధిత మహిళల వివరాలు గోప్యంగా ఉంచుతామని అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: