చాలామంది ప్రజలలో ప్రభుత్వ ఆఫీసుల్లో పనులు జరగాలంటే లంచాలు ఇస్తే మాత్రమే పనులు జరుగుతాయనే నమ్మకం బలపడింది. కొందరు లంచాలు ఇవ్వలేక ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే మరికొందరు మాత్రం ఏసీబీని ఆశ్రయిస్తున్నారు. ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు అవినీతిపరులే అనే అభిప్రాయం మెజారిటీ ప్రజల్లో ఉంది. కానీ ప్రభుత్వ కార్యాలయంలో పని చేసే ఒక అధికారి మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో నిజాయితీగా పని చేస్తే అవినీతి అనేదే ఉండదని పేర్కొన్నారు. 
 
కరీంనగర్ సర్కిల్ కార్యాలయంలో ఏడీఈగా పని చేసే పోడేటి అశోక్ తన కార్యాలయంలో లంచం తీసుకోనని బోర్డు పెట్టించారు. పెద్ద అక్షరాలతో అశోక్ తన కార్యాలయంలో నేను లంచం తీసుకోను అని బోర్డు పెట్టించడం చర్చనీయాంశమైంది. అవినీతి రహిత వ్యవస్థ అందరూ నిజాయితీగా పని చేస్తే మాత్రమే రూపుదిద్దుకుంటుందని అశోక్ చెప్పారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అందరు అధికారులు లంచాలు తీసుకుంటున్నారని నేను అనుకోను. నిజాయితీగా పని చేసే వారు కూడా ఉంటారని అశోక్ చెబుతున్నారు. 
 
తనలాంటి నిజాయితీగా పని చేసే ఆఫీసర్స్ కూడా ఉంటారని ప్రభుత్వ అధికారులందరూ అవినీతిపరులు అనే అభిప్రాయం తప్పని అశోక్ చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజలకు నమ్మకం పోతూ ఉండటంతో ఈ పని చేయాల్సి వచ్చిందని అశోక్ చెబుతున్నారు. అబ్దుల్లాపూర్ మెట్ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ విజయారెడ్డి హత్య తరువాత ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేసే అధికారులు భయపడుతున్నారు. 
 
మరోవైపు కర్నూలు జిల్లా గూడూరు మున్సిపాలిటీ తహశీల్దార్ కార్యాలయంలో తహశీల్దార్ హసీనా బీ అడంగల్ లో రెడ్ మార్క్ తొలగించేందుకు 4 లక్షల రూపాయలు డిమాండ్ చేయటంతో రైతు సురేశ్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులు రైతు సురేశ్ డబ్బులు ఇచ్చే సమయంలో హసీనా బీ బినామీని పట్టుకున్నారు. తహశీల్దార్ హసీనా బీ ప్రస్తుతం పరారీలో ఉన్నారు. నిన్న కర్నూలు జిల్లాలో మరో తహశీల్దారు 7వేల రూపాయలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. పోడేటి అశోక్ ఆఫీసులో  లంచం తీసుకోనని బోర్డు పెట్టుకోవడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: