తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె రోజు రోజుకు ఉగ్రరూపం దాలుస్తుంది . కాగా నేటితో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె 44వ రోజుకు చేరుకుంది. కానీ ఇప్పుడు వరకు ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు పరిష్కారం విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రం సానుకూలంగా స్పందించలేదు. ఇప్పటికే ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. ఇక తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మె పై హైకోర్టులో కూడా విచారణ జరుగుతూనే ఉంది  వాయిదా పడుతూనే ఉంది. ఇప్పుడు వరకు ఆర్టీసీ సమ్మె పై హైకోర్టులో విచారణ ఓ కొలిక్కి రాలేదు. అటు ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఆర్టీసీ ప్రైవేటీకరణ చేసేందుకు ఎక్కువ మొగ్గుచూపుతుండటంతో ఆర్టీసీ కార్మికుల సమ్మె భవితవ్యం ఏంటన్నది  ప్రశ్నార్థకంగా మారిపోయింది. 



 అటు జెఏసి నేతలు మాత్రం తమ డిమాండ్ల పరిష్కారం అయ్యే అంతవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.తాజాగా  ప్రకటించిన భవిష్యత్తు ప్రణాళిక లో భాగంగా... ఆర్టీసీ జేఏసీ కన్వీనర్  అశ్వత్థామరెడ్డి నిరాహార దీక్షకు పూనుకున్నారు. పోలీసులు ఆర్టీసీ జేఏసీ తలపెట్టిన  దీక్షకు అనుమతి ఇవ్వకుండా  అశ్వద్ధామ రెడ్డిని గృహనిర్బంధం చేయడంతో అశ్వత్థామరెడ్డి తన స్వంత నివాసంలోనే దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణిస్తోంది అంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు సంకేతాలు కూడా వస్తున్నాయి. ఇప్పటికే ఆయన నివాసం వద్దకు పోలీసులు భారీ సంఖ్యలో చేరుకున్నారు. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి చేపట్టిన దీక్షను విరమించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.కాగా   అశ్వత్థామరెడ్డి దీక్షను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. 



 అశ్వద్ధామ రెడ్డి నివాసానికి చేరుకున్న  పలువురు నేతలు ఆయనను  పరామర్శించారు. అంతే కాకుండా బిజెపి నేతలు వివేక్ రెడ్డి జితేందర్ రెడ్డిలు  ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి  పరామర్శించేందుకు ఆయన నివాసానికి బయలుదేరగా  మార్గమధ్యంలోనే పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వారు ఆందోళనకు దిగడంతో పోలీసులు స్వయంగా వారిని అశ్వత్థామరెడ్డి నివాసానికి తీసుకువచ్చారు. అయితే అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను పరిష్కారం  చూపే వరకు తన దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.అయితే అశ్వద్ధామ రెడ్డి నివాసం వద్దకు భారీగా మోహరించిన పోలీసులు అశ్వద్ధామ రెడ్డి దీక్షను భగ్నం చేశారు. దీక్ష విరమించాలని చెప్పినప్పటికీ వినక పోవడంతో ఆయన దీక్షను భగ్నం చేసి అరెస్ట్ చేశారు పోలీసులు. కాగా  ఆ కాలనీ వాసులకు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: