మొన్నటి ఎన్నికల్లో  తెలుగుదేశంపార్టీ ఘోరంగా ఓడిపోయిన తర్వాత సొంత సామాజికవర్గం కూడా దూరమైపోతోందా ? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తే కమ్మ సామాజికవర్గం నేతలు పార్టీకి  మెల్లిగా దూరమైపోతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ, దేవినేని అవినాష్ లాంటి యువనేతలు టిడిపికి దూరమైపోయారు.

 

చంద్రబాబునాయుడు నాయకత్వం మీద నమ్మకం లేకపోవటం, టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందన్న ఆశలు చెదిరిపోవటంతో కమ్మ సామాజికవర్గం నేతలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటున్నారు. ఇలా పార్టీ నుండి బయటకు వచ్చేస్తున్న వారిలో కొందరు బిజెపి వైపు అడుగులేస్తుంటే మరికొందరు వైసిపిలో చేరటానికి రెడీ అవుతున్నారు.

 

రాష్ట్రం సమైక్యంగా ఉన్నపుడు కమ్మ సామాజికవర్గం నేతలు  కాంగ్రెస్ లో కూడా ఎక్కువగానే ఉండేవారు. అయితే వైఎస్ మరణించటం, రాష్ట్ర విభజన తర్వాత ఎక్కువమంది కమ్మ నేతలు టిడిపిలో సర్దుకున్నారు.  చంద్రబాబు చేసిన పొరబాటు వల్ల తెలంగాణాలో టిడిపి కనుమరుగైపోయే ప్రమాదంలో పడింది. దాంతో తెలంగాణాలోని కమ్మ నేతల్లో ఎక్కువమంది  టిఆర్ఎస్ లో చేరిపోయారు.  

 

 

ఏపిలో టిడిపి అధికారంలో ఉన్నపుడు ఇదే కమ్మ నేతల్లో చాలామంది చేసిన ఓవర్ యాక్షన్ వల్ల కమ్మేతర సామాజికవర్గాల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోయింది. సరే కారణాలు ఏవైనా  మొన్నటి ఎన్నికల్లో టిడిపికి గూబ పగిలిపోయింది. దాంతో కమ్మ నేతల్లో సఫకేషన్ మొదలైంది. అందుకనే టిడిపిలో నుండి బయటకు వచ్చేస్తున్నారు. ఎప్పుడైతే చంద్రబాబే స్వయంగా నలుగురు రాజ్యసభ ఎంపిలను బిజెపిలోకి పంపారో అప్పటి నుండే టిడిపి నేతల్లో ప్రధానంగా కమ్మోరిలో  అభద్రత పెరిగిపోయింది.

 

బిజెపిలోకి వెళ్ళిన దగ్గర నుండి సుజనా చౌదరి, గరికపాటి మోహన్ రావు లాంటి వాళ్ళు టిడిపిలోనే ఉన్న తమ సామాజికవర్గం నేతలను బిజెపిలోకి లాగేయటం మొదలుపెట్టారు. ధర్మవరం మాజీ ఎంఎల్ఏ వరదాపురం సూరి, ఎంఎల్సీగా రాజీనామా చేసిన అన్నం సతీష్ ప్రభాకర్ లాంటి కమ్మ నేతలు బిజెపిలో చేరిన విషయం తెలిసిందే. తొందరలోనే ప్రకాశం, గుంటూరు, కృష్ణ, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని మరింత మంది నేతలు బిజెపిలో వెళ్ళేందుకు రంగం  రెడీ చేసుకుంటున్నారట. మొత్తం మీద చంద్రబాబుకు సొంత సామాజికవర్గం నుండే షాకులు తప్పటం లేదు.

 

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: