గులాబీ జెండాకు మేమే ఓనర్లం అంటూ టీఆర్ఎస్‌లో తొలిసారిగా మంత్రి ఈట‌ల రాజేంద‌ర్  నిర‌స‌న గ‌ళం వినిపించిన విష‌యం తెలిసిందే. అస‌మ్మ‌తి నేత‌ల‌కు ఆయ‌న‌కు నాయ‌క‌త్వం వ‌హిస్తున్నారంటూ పార్టీలో కేసీఆర్‌, కేటీఆర్ అనుకూల పార్టీ నేత‌లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న‌పై వేటు త‌ప్ప‌ద‌ని అప్ప‌ట్లో జోరుగా ప్ర‌చారం జ‌రిగింది. కాని అదేమీ జ‌ర‌గలేదు. బీసీ సామాజిక వ‌ర్గంలో మంచి ప‌ట్టున్న నేత‌గా ఆయ‌న‌కు మంచి పేరుంది. దీంతో కేసీఆర్ అప్పుడున్న ప‌రిస్థితుల్లో వెన‌క్కు త‌గ్గార‌ని సోష‌ల్ మీడియాతో పాటు ప్ర‌ముఖ ప‌త్రిక‌ల్లో ఆఫ్ ది రికార్డు అంటూ క‌థ‌నాలు ప్ర‌చురించాయి.


ఈట‌ల‌కు ప‌ద‌వి గండం త‌ప్పిన‌ట్లేన‌ని అనుకుంటున్న స‌మ‌యంలో ఆయ‌న‌కు మంత్రివ‌ర్గం నుంచి ఉద్వాస‌న త‌ప్ప‌ద‌ని మ‌ళ్లీ ప్ర‌చారం ఆరంభం కావ‌డం గ‌మ‌నార్హం. త‌ర్వ‌లోనే ముఖ్య‌మంత్రి కేసీఆర్ మంత్రివ‌ర్గంలో మార్పులు చేర్పుల‌కు శ్రీకారం చుడుతుంద‌ని పార్టీలోని కొంత‌మంది ముఖ్య‌నేత‌లు అభిప్రాయం వ్య‌క్తం చేస్తుండ‌టంతో ఇదంతా కొట్టిపారేసే విష‌యం కాదేమోనని హుజూర‌బాద్ నియోజ‌క‌వ‌ర్గంలోని పార్టీ కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న చెందుతున్నార‌ట‌.


అయితే, ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకు నాలుగు మంత్రి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టారు సీఎం కేసీఆర్‌. ఆ జిల్లా నుంచి కేటీఆర్‌, ఈట‌ల రాజేంద‌ర్‌, కొప్పుల ఈశ్వ‌ర్‌, గంగుల కమ‌లాక‌ర్‌ మంత్రులుగా కొన‌సాగుతున్నారు. ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లాకే ఎక్కువ మంత్రి ప‌ద‌వులు ద‌క్క‌డంతో ఒక‌రిని త‌గ్గించాల‌ని కేసీఆర్ భావిస్తున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. అయితే ఈసారి మొద‌టి నుంచి తప్పించే వారి జాబితాలో ఈట‌ల పేరు ప్ర‌ముఖంగా ఉన్న విష‌యాన్ని కూడా వారు గుర్తు చేస్తున్నారు. 


అయితే ఈట‌ల వ‌ర్గం మాత్రం ఎలాంటి అవినీతి, అక్ర‌మ ఆరోప‌ణ‌లు లేని రాజేంద‌ర్‌ను త‌ప్పించ‌డం అంటే జిల్లాలో పార్టీ ప‌త‌నాన్ని కోరుకున్న‌ట్లేన‌ని తీవ్రంగా హెచ్చ‌రిస్తోందంట‌.  ఇప్ప‌ట్లో తేనేతుట్ట‌ను క‌ద‌ప‌డానికి కేసీఆర్ కూడా ఇష్ట‌ప‌డ‌ర‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. చూడాలి ఏం జ‌రుగుతుందో..?


మరింత సమాచారం తెలుసుకోండి: