అయోధ్య కేసులో కీల‌క ట్విస్టు తెర‌మీద‌కు వ‌చ్చింది. అయోధ్య‌ తీర్పులో ముస్లింలకు న్యాయం జరుగలేదని అల్ ఇండియా ముస్లిం లా బోర్డు తెలిపింది. అయోధ్యలోని వివాదాస్పద స్థలాన్ని రామ మందిరానికి కేటాయిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో తాము సంతృప్తిగా లేమని ముస్లిం కక్షిదారుల్లో ఒక‌రైన ఆలిండియా ముస్లిం పర్సనల్‌ లా బోర్డు (ఏఐఎంపీఎల్‌బీ) ప్రకటించింది. తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఏఐఎంపీఎల్‌బీ తెలిపింది. ముస్లిం పక్షాలతో లక్నోలో లా బోర్డు కీలక నిర్ణయం అనంత‌రం సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తామని  ఏఐఎంపీఎల్‌బీ కార్యదర్శి, ముస్లిం కక్షిదారుల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన జఫర్యాబ్‌ జిలానీ  తెలిపారు. 


విశ్వాసాలను బట్టి కాకుండా ఆధారాలను బట్టి తీర్పు ఇస్తుందని ఆశించామని అయితే, తీర్పులో అనేక పరస్పర విరుద్ధ వాదనలు ఉన్నాయని జిలానీ అన్నారు. తాము సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తున్నామని, అయితే తీర్పు తమను అసంతృప్తికి గురిచేసిందన్నారు. బాబ్రీ మసీదు ఉన్న స్థలం కాకుండా తమకు వేరే చోట ఐదెకరాల భూమిని కేటాయించడాన్ని వారు తిరస్కరించారు. సుప్రీం తీర్పులో ముస్లింలకు న్యాయం జరగలేదని ముస్లిం లా బోర్డు వాదిస్తోందని తెలిపారు. తాము మొత్తం తీర్పును వ్యతిరేకించడం లేదని, కొన్ని అంశాలతో మాత్రం విభేదిస్తున్నామని తెలిపారు. వివాదాస్పద స్థలంతోపాటు, ప్రాంగణాన్ని కూడా హిందువులకే అప్పగించడాన్ని వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. ఈ కేసులో తుది వరకు పోరాడాల్సిన అవసరం ఉందని స‌మావేశంలో అభిప్రాయం వ్య‌క్త‌మైన‌ట్లు ఆయ‌న తెలిపారు. ‘1992లో బాబ్రీ మసీదును కూల్చివేయడం ద్వారా ఆటవిక న్యాయానికి నాంది పలికారు. ఇకపై దేశంలోని ఏ మసీదును కూడా ముట్టుకునే సాహసం చేయని స్థాయిలో సుప్రీంకోర్టు తీర్పు ఉంటుందని ఆశించాం’ అని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఆధారాలు తమకే అనుకూలంగా ఉన్నా, తీర్పు వ్యతిరేకంగా రావడంతో బోర్డు అసంతృప్తి చెందిందని తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: