చేసే ప‌ని దుర్మార్గం..అన్యాయం..ఆట‌వికం...త‌మ లైంగిక‌వాంఛ తీర్చుకోవ‌డానికి దేవుడి ఆచారమంటూ ఎంతో మంది ఆడ‌వాళ్ల జీవితాల‌ను నాశ‌నం చేస్తున్నారు. జోగిణి, బసివిణి, దేవదాసి, మాతంగి.. ఇలా వివిధ పేర్ల‌తో మ‌హిళ‌ల‌ను, అమ్మాయిల‌ను, చివ‌రికి అభంశుభం తెలియ‌ని బాలిక‌ల‌ను కూడా రొంపిలోకి దించుతున్నారు.  పేరు ఏదైనా జరిగేది మాత్రం లైంగిక దోపిడీయే. త‌రాలు మారుతున్నా ఈ దిక్కుమాలిన ఆచారానికి మాత్రం చ‌ర‌మ‌గీతం పాడ‌టం లేదు. చాలా వ‌ర‌కు తగ్గినా..ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో అక్క‌డ‌క్క‌డా త‌న ఆన‌వాళ్ల‌ను నిలుపుకునే ఉంది. 


ఎప్పుడూ కరవు కాటకాలతో తల్లడిల్లే అనంతపురం జిల్లాలోనే కాదు కర్నూలు, మహబూబ్‌న‌గర్ వంటి జిల్లాల్లోనూ ఈ పాడు సంస్కృతి వేళ్లూనుకునే ఉంది.  ప్రాంతానికో..పేరు..రాష్ట్రానికో దేవుడి పేర అమ‌ల‌వుతున్న ఈ మూఢ‌చారానికి దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది సంఖ్య‌లో మ‌హిళ‌లు జీవితాల‌ను న‌ర‌క‌ప్రాయం చేసుకుంటున్నారు. దానికి దేవుడు పేరు పెట్టి  త‌మ లైంగిక వాంఛ తీర్చుకోవాడానికి అమాయ‌క అమ్మాయిల జీవితాల‌ను బ‌లి చేస్తున్న ఆచారాలు  ఇంకా  కొన‌సాగుతున్నాయి. 


అమ్మాయికి అమ్మ‌వారు ప‌ట్టింద‌ని..బాలిక‌కు ఆరోగ్యం బాగోలేద‌ని.. వీరు జీవితాంతం దేవుళ్ల‌కు సేవ చేయాల‌ని  గ్రామాల్లోని అగ్ర సామాజిక‌వ‌ర్గాలుగా చెప్పుకునే పెద్ద‌లే వీరిని దేవాదాసీలుగా  మార్చుతున్నారు. బాలిక లేదా మ‌హిళ దేవుడికి సేవ చేయాలన్న కారణం చూపి.. లైంగిక వాంఛ తీర్చుకుంటూ దారుణాల‌కు ఒడిగ‌డుతున్నారు.  దేవ‌దాసి వృత్తిలో మ‌గ్గిపోతున్న‌వారిలో  బడుగు, బలహీన వర్గాలకు చెందిన వాళ్లే ఉంటుండ‌టం గ‌మ‌నార్హం.  బాలిక‌ల‌ను దేవ‌దాసీలుగా మార్చే క్ర‌మంలో వారి త‌ల్లిదండ్రుల‌కు ఎన్నో ఆశ‌లు చూపుతారు. 


పొలం  లేదంటే ఇంటి స్థలమో కొద్ది మేర ఇచ్చి లైంగిక అవ‌స‌రాల‌కు అనుగుణంగా ఆ బాలిక‌ను వాడుకోవ‌డం త‌రాలుగా వ‌స్తోంది.  ఆడపిల్లల్ని ఆటవస్తువులుగా మార్చి లైంగిక వాంఛలు తీర్చుకుంటున్నారు. కొన్ని దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఈ దురాచారం కొనసాగుతోంది. ఈ దురాచారాన్ని రూపుమాల్సిన  బాధ్య‌త స‌మాజంలోని ప్ర‌తీ ఒక్క‌రిపైనా ఉంది. మూఢ‌న‌మ్మ‌కాల‌ను ప్ర‌జ‌ల మెద‌ళ్ల నుంచి పార‌దోలిన‌ప్పుడే ఇది సాధ్య‌మ‌వుతుంద‌ని కంచె ఐల‌య్య‌లాంటి  సామాజిక వేత్త‌లు స్ప‌ష్టం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: