కంచుకోట లాంటి కృష్ణా జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముందు కొందరు నేతలు టీడీపీకి షాక్ ఇస్తే....ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత మరికొందరు నేతలు తట్టా బుట్టా సర్దేసుకుంటున్నారు. మూడు రోజుల క్రితం తెలుగుదేశం పార్టీకి ఇద్దరు బడా నేతలు షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. విజయవాడ నగరంలో మంచి పట్టున్న యువనాయకుడు దేవినేని అవినాష్ చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి, జగన్ కు షేక్ హ్యాండ్ ఇవ్వగా, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాబుని బండ బూతులు తిట్టి మరి జగన్ కు జై కొట్టారు.


ఈ క్రమంలోనే టీడీపీలో మరో బిగ్ వికెట్ పడనుందని తెలుస్తోంది. విజయవాడ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ మళ్ళీ సొంతగూటికి తిరిగి పయనమవుతున్నారని ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే ఈయన సొంతగూటికి వెళ్ళేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టేసినట్లు సమాచారం.  అయితే జలీల్ టీడీపీని వీడటానికి కారణాలు లేకపోలేదు. అసలు జలీల్ రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైంది. 1999లో కాంగ్రెస్ నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో జగన్ వెంట నడిచి 2014లో మరోసారి పశ్చిమ నుంచి విజయం సాధించారు.


అయితే ఆయన వెంటనే జగన్ కు వెన్నుపోటు పొడిచి అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు చెంతకు చేరారు. ఇక అధికారంలో ఉన్నన్ని రోజులు బాగానే గడిపిన జలీల్...2019 ఎన్నికల్లో తాను పోటీ నుంచి తప్పుకుని కుమార్తె షబానాని బరిలోకి దింపారు. కానీ కుమార్తెని గెలిపించుకోలేకపోయాడు. అయితే తన కుమార్తె ఓటమికి కారణం పశ్చిమలోని టీడీపీ నేతలు నాగుల్ మీరా, బుద్దా వెంకన్న లాంటి వారి సహకారం లేకపోవడమే అని అధినేత వద్ద మొర పెట్టుకున్నారు. పైగా తన నియోజకవర్గంలో ఎంపీకు ఎక్కువ ఓట్లు పడి తన కుమార్తెకు తక్కువ ఓట్లు వచ్చాయని చెబుతున్నారు.


కాకపోతే జలీల్ ఎంత మొర పెట్టుకున్న బాబు మాత్రం లెక్క చేయడం లేదు. పైగా బుద్దా, నాగుల్ మీరాలనే వెనుకేసుకుని వస్తున్నారు. దీంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జలీల్...తిరిగి వైసీపీ గూటికి వెళ్లడానికి చూస్తున్నారు. కానీ వెన్నుపోటు పొడిచి  వెళ్ళిన జలీల్ ని జగన్ తిరిగి పార్టీలో చేర్చుకోవడం కష్టమే. అయితే రాజకీయాల్లో అనేక అవసరాలు ఉంటాయి కాబట్టి ఏ క్షణంలో జలీల్ వైసీపీలో చేరుతారో చెప్పలేం. 


మరింత సమాచారం తెలుసుకోండి: