టీవీల్లో చూస్తూంటాం.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు.. పట్టు చీర పట్టు అని మహిళలకు గేమ్ షో. ఇపుడు ఏపీ రాజకీయాల్లో అటువంటిదే మరో స్కీం అమలు అవుతోంది. అయితే ఈ స్కీంలో చీరలు నగలు ఉండవు, ఏకంగా ఎమ్మెల్యే సీటు హాయిగా దక్కుతుంది. ఈ స్కీం బాగా పాపులర్ అవుతోందిపుడు. ఈ స్కీంకి యమ డిమాండ్ ఉండడంతో ఎవరి మటుకు వారు తొందర పడిపోయే అవకాశాలు ఎక్కువగా  ఉన్నాయి.


ఈ స్కీం కి ఆద్యుడు టీడీపీకి రాజీనామా చేసిన రెబెల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. ఆయన కామ్  గా టీడీపీకి రాజీనామా చేశారు.  ఆ తరువాత మంచి ముహూర్తం చూసుకుని అధినేత చంద్రబాబునే చెడ తిట్టేసారు. దాంతో ఆగ్రహించిన టీడీపీ అధ్యక్షుడు ఆయన్ని సస్పెండ్ చేసి పారేశారు. తనకు అదే కావాల్సింది అని వంశీ అనుకున్నారు. ఇపుడు వంశీ ఫ్రీ బర్డ్. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్వేచ్చా జీవి. ఆయనకు హైకమాండ్ ఎవరూ లేరు. హ్యాపీగా వైసీపీకి మద్దతు ఇవ్వవచ్చు. 


ఆయన్ని ఇండిపెండెంట్ సభ్యునిగా అసెంబ్లీలో చూస్తామని స్పీకర్ తమ్మినేని సీతారామ్  చెప్పారు. అందువల్ల వంశీ ఒక్క కండువా కప్పుకోకుండా ఉంటే చాలు, వైసీపీకి తనకు నచ్చిన విషయంలో మద్దతు ఇవ్వచ్చు, అదే విధంగా చంద్రబాబుని అసెంబ్లీ లోపలా బయటా తిట్టవచ్చు. మరి ఇంత మంచి ఆలోచన ఇతర తమ్ముళ్ళు తమకెందుకు రాలేదని అనుకుంటున్నారు. అధికార వైసీపీకి మద్దతుగా ఉందామనుకున్నా కూడా ఎమ్మెల్యే గిరీ పోతుందేమోనని భయంతోనే తమ్ముళ్ళు ఇన్నాళ్ళు భయపడ్డారు. ఇపుడు అటువంటి వారికి వంశీ రహ‌దారి చూపారు.


ఇక డేరింగ్ గా మిగిలిన తమ్ముళ్ళు వంశీ బాటలోనే నడుస్తారని అంటున్నారు. వంశీ మాదిరిగానే హై కమాండ్ ని ధిక్కరించడం. ఒక సస్పెన్షన్ వేటు వేయించుకోవడం, హ్యాపీగా ప్రత్యేక సీటులో కూర్చుని మరీ  జగన్ని పొగుడుతూ అధికార పార్టీ మర్యాదలు అన్నీ పొందవచ్చు. ఇపుడు ఇదే టీడీపీ హై కమాండ్ ని బాగా టెన్షన్ పెడుతోంది. ఇలా వంశీ రూట్లో ఎంతమంది ఎమ్మెల్యేలు దౌడ్ తీస్తారో, అసలు విపక్ష హోదా ఉంటుందా వూడుతుందా అన్నది పెద్ద ప్రశ్న‌గా ఉంటోందని పసుపు శిబిరం కలవరపడుతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: