పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు  సిద్ధం చేశాయి. సభా కార్యక్రమాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని కోరుతూ... పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో పాటు...లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్ అధ్యక్షతన ఢిల్లీలో వేర్వేరుగా ఆల్‌పార్టీ మీటింగ్‌ జరిగింది. 


పార్లమెంటరీ  వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌జోషి అధ్యక్షతన..ఢిల్లిలోని పార్లమెంటరీ లైబ్రరీ హాల్ లో అఖిలపక్ష సమావేశం జరిగింది.  ప్రధాని నరేంద్ర మోడీతో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ  పక్ష నేతలు హాజరయ్యారు. వైసీపీ నుంచి విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి.. టీడీపీ  నుంచి గల్లా జయదేవ్‌.. టీఆర్‌ఎస్‌ నుంచి కేకే, నామా నాగేశ్వరరావులు  హాజరయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల  నిర్వహణపై ఈ సమావేశంలో చర్చించారు. 


కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి పార్టీల  అభిప్రాయాలను తీసుకున్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలను పార్టీలకు  వివరించారు. మరోవైపు, రాజ్యసభ చైర్మన్..లోక్ సభ స్పీకర్ అధ్యక్షతన  ఆల్ పార్టీ సమావేశం జరిగింది. సభ సజావుగా జరిగేలా చూడాలని బిర్లా, వెంకయ్యనాయుడు అన్ని పక్షాలను  కోరారు. ఏపీ సమస్యలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రాన్ని అడిగినట్లు వైసీపీ ఎంపీలు తెలిపారు. తెలంగాణ ఏర్పడి ఆరేళ్లవుతున్నా.. ఇంకా అనేక విభజన సమస్యలు పెండింగ్‌లోనే ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు టీఆర్‌ఎస్‌ ఎంపీ నామా నాగేశ్వరరావు. ఆల్‌ పార్టీ మీటింగ్‌లో ఈ అంశాలను పరిష్కరించాలని కేంద్రాన్ని కోరినట్లు ఆయన చెప్పారు. మొత్తంగా, రేపటి నుంచి వచ్చే నెల 13వరకు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడీవేడీగా జరగబోతున్నాయి. 


మరోవైపు దాదాపు 27బిల్లులు పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదం పొందనున్నాయి. కీలక చర్చల తర్వాత ఈ బిల్లలకు గ్రీన్ సిగ్నల్ పడనుంది. ఇదిలా ఉంచితే పలు రాష్ట్రాలు తమకు రావాల్సిన నిధులు.. ఇచ్చిన హామీలపై కేంద్రాన్ని గట్టిగా నిలదీసేందుకు ఆయా రాష్ట్రాల ఎంపీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకున్నారు. మరి అధికార బీజేపీ ఈ ఎంపీల వ్యాఖ్యలను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.  
 
 


మరింత సమాచారం తెలుసుకోండి: