ఎవరు అవునన్న కాదన్నా ప్రతి వారికి కులాభిమానం ఉంటుంది. అది కమ్మ సామాజికవర్గంలోనూ  ఉంది. అయితే కమ్మలు సొంత రాజకీయ  ఉనికి కోసం పోరాటం చేసి టీడీపీ రూపంలో సాధించుకున్నారు. స్వాతంత్ర పోరాటంలో వారూ భాగస్వామ్యం అయ్యారు. ఆ తరువాత ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడితే తాము అధికారంలోకి రావచ్చు అనుకున్నారు. తొలి ఎన్నికల్లో వామపక్షాల వైపు ఉన్న కమ్మ సామాజిక వర్గం కాంగ్రెస్ కి ఢీ అంటే ఢీ కొట్టింది. ఇక కొంతమంది కమ్మలు కాంగ్రెస్ లో ఉండి ముఖ్యమంత్రి కోసం ప్రయత్నం చేసినా కుదరలేదు.


దాని ఫలితమే టీడీపీ ఏర్పాటు, తెలుగుదేశం ఆవిర్భావం వెనక అప్పటి కాంగ్రెస్ మంత్రి కమ్మ నేత నాదెండ్ల భాస్కర రావు క్రుషి కూడా ఉందంటే  నమ్మాల్సిందే. ఇక అన్న గారి సినీ గ్లామర్ తో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఇక ఆ పార్టీని పటిష్టం చేయడంతో చంద్రబాబు పాత్ర కూడా చాలా  ఉంది. ఇలా నలభయేళ్ళ పాటు టీడీపీ తెలుగు రాజకీయాల్లో వెలిగిపోతూ వస్తోంది. అటువంటి టీడీపీని 2019 ఎన్నికలు మూలన కూర్చోబెట్టేశాయి.


టీడీపీ అధికారం కోల్పోవడమే కాదు దారుణంగా పరాజయం పాలు అయింది. ఇక భవిష్యత్తు పార్టీకి లేదని అంతా అనుకునే పరిస్థితి. దానికి కారణం చంద్రబాబుకు వయసు అయిపోయింది. లోకేష్ కి సమర్ధత లేకపోవడంతో టీడీపీకి నేతలు ఒక్కొక్కరుగా గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇక్కడే చంద్రబాబు రాంగ్ రూట్లో వెళ్తున్నారని అంటున్నారు. మమతా బెనర్జీ, మాయావతి వంటి వారు పెళ్ళి కూడా చేసుకోలేదు. కానీ తమ భావి వారసులను ప్రకటించి ఉంచుకున్నారు. సోదరుల పిల్లలనే వారసులుగా చేసుకుని పార్టీకి కొత్త ఆశ కల్పిస్తున్నారు.


బాబు విషయంలో మాత్రం తాను, తన కుమారుడు అన్న నీతి మాత్రమే అమలు చేస్తున్నారు. మనసు విశాలం చేసుకుని బావమరిది కుమారుడు జూనియర్ ఎన్టీయార్ కి అవకాశం కల్పిస్తే టీడీపీ బాగుపడుతుంది, మళ్ళీ రేపటి మీద ఆశలు కూడా కలుగుతాయి. కానీ బాబు లోకేష్ మాత్రమే వారసుడు అంటున్నారు. ఫలితంగా నాలుగు దశాబ్దాలుగా వెలిగిన టీడీపీ జెండా ఇపుడు నేల చూపులు చూస్తోంది. ఇది ఒక విధంగా ఇది  కుటుంబ సమస్య కాదు, కమ్మ సామాజికవర్గం సమస్య కూడా. అదే సమయంలో ప్రజాస్వామ్యవాదుల విషయం చూసుకున్నా బలమైన టీడీపీ ఇలా అంతర్ధానం కావడాన్ని ఎవరూ సహించరు. అందువల్ల బాబు ఇప్పటికైనా పటిష్టమైన నాయకత్వాన్ని భవిష్యత్తుకు చూపించేలా చర్యలు తీసుకోవాలి. లేకపోతే సొంత సామాజిక వర్గానికి అన్యాయమే చేసినట్లవుతుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: